
ఎన్‌ఆర్‌ఐ దంపతులపై జనసేన నాయకుని దాడి.. అన్నమయ్య జిల్లాలో దారుణం
రైల్వేకోడూరు అర్బన్/ఓబులవారిపల్లె: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా అంటూ ఒక జనసేన నాయకుడు ఎన్‌ఆర్‌ఐ దంపతులపై దాడి చేసిన దారుణ ఘటన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, చెన్నరాజుపోటులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, బుధవారం రాత్రి గ్రామంలో శ్రీ సీతారాముల గ్రామోత్సవాన్ని నిర్వహించారు.ఒంటిగంట సమయంలో దేవుడి ఊరేగింపు ఎన్నారై పత్తి సుబ్బరాయుడు ఇంటి వద్దకు చేరుకుంది.
ఆరోజే కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన ఆయన, భార్య రాజేశ్వరితో కలిసి బయటకు వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటుండగా, మాజీ సర్పంచ్, జనసేన పార్టీ రాయలసీమ జోనల్ కన్వీనర్ జోగినేని చిన్నమణి ఇనుపరాడ్‌తో ఇరువురిపై దాడిచేసి, చంపేస్తానంటూ బెదిరించాడు.
డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్, జిల్లా ఎస్పీ అందరూ తెలిసిన వారేనని పేర్కొంటూ, మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ వెళ్లిపోయాడు. బాధిత దంపతులు రైల్వేకోడూరు సీఐ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ, గతంలో గ్రామంలో పొలాల వద్ద చిన్నమణికి తమకు విభేదాలు ఉన్నాయని, అవి మనసులో పెట్టుకొని తమపై కక్షపెట్టుకుని చంపుతానని బెదిరిస్తున్నాడని అన్నారు. దీనిపై సీఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు.