
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది.
ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం.

అవే ఆమె చివరి మాటలు..
దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.