
అడవి జంతువులే లక్ష్యంగా ఉచ్చులు వేస్తున్న వేటగాళ్లు
ఇటీవల చిరుతతోపాటు అడవి పందుల మృత్యువాత
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అన్నమయ్య జిల్లాలో విష సంస్కృతి
అడవులపై వేటగాళ్లు పంజా విసురుతున్నా పట్టించుకోని అటవీశాఖ
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లాలో ఆటవిక రాజ్యం కొనసాగుతోంది.కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విష సంస్కృతికి బీజం పడింది. నాటు తుపా కులతో అడవులను చెరబట్టడం..వేట పేరుతో కొనసాగుతున్న దమనకాండతో వన్య మృగాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదేమని అడిగే అధికారులు లేక, తాము చెప్పిందే వేదమన్నట్లు అడవుల్లో వేట కొనసాగిస్తున్నారు. పెద్ద జంతువులను వధించేందుకు వేట గాళ్లు వేస్తున్న ఉచ్చులు చిన్న జంతువుల ప్రాణాలు తీస్తున్నాయి. ఒక్కొసారి వేటగాళ్లు జంతువులపై ఎక్కుపెట్టిన గురి తప్పి పలువురు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
అమాయకుల బలి
జిల్లాలో లైసెన్స్‌డ్ తుపాకులు పక్కనపెడితే అడవిలో వేటాడటానికి అప్పట్లో తీసుకున్న తుపాకులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే వేట కోసం వెళుతున్న వేటగాళ్లు అదుపు తప్పో.. గురితప్పో..జంతువులను కాల్చబోయి అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. ఇటీవల రాయచోటి సమీపంలోని మాధవరం వద్ద వేటగాళ్ల కాల్పుల్లో హనుమంతు అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.
అంతే కాకుండా గుర్రంకొండ ప్రాంతంలో కూడా గతంలో అడవి జంతువులనుకుని కాల్చడంతో ఓ మహిళ ఇదే తరహాలో గాయపడి నెలరోజుల తర్వాత కోలుకుంది. అడవి పందుల కోసం వేసిన విద్యుత్ తీగలు తగులుకుని పలువురు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిన ప్రస్తుత తరుణంలోనూ వేట పేరుతో జంతువులను తుద ముట్టడిస్తుండడం పట్ల పలువురు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నియంత్రణ ఏదీ..
జిల్లాలో వేటగాళ్లు అడవి జంతువులను పట్టడానికి ఉచ్చు బిగిస్తున్నారు. అవి వన్యప్రాణుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. నాలుగు రోజుల కిందట మదనపల్లె పరిధిలోని పొన్నేటిపాలెం వద్ద వేటగాళ్ల ఉచ్చుకు గర్భంతో ఉన్న చిరుత మృత్యువాత పడిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా చిరుత కావడంతో వ్యవహారం కాస్త బట్టబయలైంది. అటవీశాఖ అ«ధికారులు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నా చిరుతను సంరక్షించుకోలేకపోయారు.
ఈ ఘటన ఓ ఉదాహరణ మాత్రమే. అధికారులకు తెలియకుండా జరుగుతున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పంటలపై అడవి పందులు దాడి చేస్తున్నాయని వేస్తున్న విద్యుత్ తీగల కారణంగా పందులతోపాటు ఇతర జంతువులు నేలరాలుతున్నాయి. వేటగాళ్లు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వేటకు వెళుతున్నా నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి.
కొరవడుతున్న పర్యవేక్షణ
జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో అడవిలో అలజడి రేగుతోంది. ప్రధానంగా సుండుపల్లె, గువ్వలచెరువు, గంగనేరు, పెద్దమడ్యం, బి.కొత్తకోట, మదనపల్లె, పెద్దమడ్యం, రాజంపేట, చిట్వేలి, చిన్నమండెం తదితర ప్రాంతాల్లోని సమీపంలోగల అడవుల్లో వేట కొనసాగుతున్నట్లు తెలియవచ్చింది. ఏది ఏమైనా వేటగాళ్లపై అటవీశాఖ అధికారుల నిఘాలేకపోవడం, వారికి అవగాహన కలి్పంచకపోవడంతో విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా అమాయకులు బలి కాకుండా ఉండాలన్నా, పెద్ద జంతువులను వేటాడకుండా ఉండాలన్నా వేటగాళ్లల్లో మానసిక పరివర్తనలో మార్పు తీసుకొస్తే ప్రయోజనం ఉంటుందని జంతు ప్రేమికులు కోరుతున్నారు.