రెండేళ్ల క్రితం అల్లూరి జిల్లా అనంతగిరి వద్ద రూ.5.50కోట్లతో శ్రీకారం
ప్రతిష్టాత్మకంగా పర్యాటక ప్రాజెక్ట్‌ను చేపట్టినవైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
కూటమి సర్కారు రాకతో ఆగిపోయిన నిర్మాణాలు
ఇప్పటికే రూ.80లక్షలతో కాఫీ హౌస్, రోడ్డు నిర్మాణం
మరో రూ.4.70కోట్ల పనులకు గ్రహణం
సాక్షి, అమరావతి: దట్టమైన అటవీ ప్రాంతం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. చెట్లపై ఆవాసాలు... వాటిలో కూర్చుని పక్షుల కిలకిలా రావాలు వింటూ.... స్వచ్ఛమైన గాలి పీలుస్తూ... ఒక కప్పు కమ్మటి కాఫీ తాగితే ఎలా ఉంటుంది... ఒక్కసారి ఊహించుకుంటేనే మనసు పరవశించిపోతుంది కదా...!
కచ్ఛితంగా అటువంటి అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు... ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తూ అడవినే నమ్ముకున్న గిరిజనులకు జీవనోపాధి కల్పించేందుకు రెండేళ్ల కిందట వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘అడవిలో ఆతిథ్యం’ పేరిట ఒక గొప్ప ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో రూ.5.50కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ‘కూటమి’ గ్రహణం పట్టింది. సాంకేతిక సమస్య సాకుతో గత మూడు నెలలుగా పనులు నిలిపివేసింది.
విశాఖ–అరకు రహదారి చెంతనే ‘అడవిలో ఆతిథ్యం’
విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో చెంతనే అనంతగిరి మండలం మర్ధగుడ గ్రామానికి సమీపంలోని అడవిలో ఆతిథ్యం ఇచ్చేలా గత ప్రభుత్వం 2022లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సింహాద్రి ఎన్టీపీసీ సహకారం అందిస్తోంది. అటవీ శాఖ పర్యవేక్షణలో ఆర్‌అండ్‌బీ శాఖకు పనులు అప్పగించారు. కాఫీ తోటల మధ్య కాఫీ తాగేలా రూ.80 లక్షలతో కాఫీ హౌస్, రోడ్డు, మంచినీటి ట్యాంక్ నిర్మాణం పూర్తిచేశారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు.
కూటమి సర్కారు వచ్చాక సాంకేతిక కారణాల పేరుతో మిగిలిన పనులు నిలిపివేశారు. ఇంకా రూ.4.70కోట్లతో పర్యాటకుల కోసం రెస్టారెంట్, కిచెన్, 16 కాటేజీలు, రిసెప్షన్, ఫర్నిచర్, విద్యుత్ కనెక్షన్లు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ద్వారా మళ్లీ డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించి పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ విశేషాలు ఇవీ..
» ప్రకృతితో మమేకమయ్యే పర్యాటకులకు ‘జీవ వైవిధ్యం’ గురించి అవగాహన కల్పించేలా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగానే ఇక్కడ ప్రత్యేక స్టడీ సెంటర్, సీతాకోక చిలుకల పార్క్, ఔషధ మొక్కల వనం, వాచ్ టవర్ ఏర్పాటు చేయాలని కార్యాచరణ చేపట్టింది.
» చెట్లపైనే హట్స్(నివాసాలు) వేసి వాటిలోనే పర్యాటకులు బస చేసేలా ఏర్పాటు చేయడం ద్వారా వారికి గొప్ప అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
» ఈ ప్రాజెక్ట్ నిర్వహణ, ఆదాయాన్ని మర్ధగుడ వన సంరక్షణ సమితి(వీఎస్‌ఎస్)లో 80 మంది సభ్యులకు ఇవ్వాల్సి ఉంది.
» ఏజెన్సీలో లభించే పనస, చింతపండు తదితర అటవీ ఫల సాయంతోపాటు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఇక్కడ విక్రయించేలా ప్రతిపాదించారు. కూటమి సర్కారు స్పందించి ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment