చింతపల్లి అటవీ ప్రాంతంలో ముందుగానే చుట్టుముట్టిన చలిగాలులు
దట్టంగా కురుస్తున్న పొగమంచు
చింతపల్లిలో 16.5 డిగ్రీలు.. పాడేరులో 18 డిగ్రీలు
సాక్షి, పాడేరు:మన్యంలో రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందస్తు చలిగాలుల వ్యాప్తితో మన్యం వాసులు ఉదయం, సాయంత్రం చలిబారిన పడుతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శీతాకాలం రాకముందే మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.
చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం 16.5 డిగ్రీలు, గురువారం 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులుగా పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 18 డిగ్రీలు, అరకులోయ కాఫీ బోర్డులో 18.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దట్టంగా పొగమంచు
ఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోనూ పొగమంచు దట్టంగా కురుస్తోంది. వేకువజామున ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. పొగమంచు తీవ్రతతో వాహన చోదకులు పగటిపూట కూడా హెడ్‌లైట్లు ఆన్ చేసుకుని వాహనాలు నడుపుతున్నారు.
తుపాను ప్రభావంతోనే..
తుపాను కారణంగా ఏజెన్సీలో చలిగాలులు అధికమయ్యాయి. నవంబర్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా చలితీవ్రత అధికంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపు పడిపోయే అవకాశం ఉంది. – డాక్టర్ అప్పలస్వామి, ఏడీఆర్, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం
Comments
Please login to add a commentAdd a comment