
పొన్నూటిపాళ్యంలో అటవీ ఉన్నతాధికారుల పరిశీలన
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటిపాళ్యంలో చిరుతపులి మరణించిన ఘటనలో...వేటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఉచ్చు వేసినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) చలపతిరావు తెలిపారు. వేటగాళ్ల ఉచ్చులో ఆడ చిరుత కడుపులో రెండు కూనలతో మృతి చెందిన ఘటనపై అటవీ, పర్యావరణశాఖమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీంతో శుక్రవారం పీసీసీఎఫ్ చలపతిరావు, అన్నమయ్య జిల్లా డీఎఫ్‌వో జగన్నాథ్‌సింగ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ తిరుపతి సర్కిల్ ఎస్.సెల్వం పొన్నూటిపాళ్యం అటవీప్రాంతంలో పర్యటించారు. అక్కడ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటనా స్థలిని పరిశీలిస్తే... రెగ్యులర్‌గా కణుతులు, దుప్పిలు వచ్చే ప్రాంతంలో కాకుండా వేరేచోట ఉచ్చు బిగించినట్లు తెలుస్తోందన్నారు. మిగిలిన విషయాలు దర్యాప్తులో తేలనున్నట్టు పేర్కొన్నారు. మదనపల్లె ఫారెస్ట్ కార్యాలయ పరిధిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన ట్రాంక్విలైజర్స్, డార్ట్‌గన్, నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు.
కాగా, పొన్నూటిపాళ్యం అడవిలోకి వెళ్లి వస్తున్న అధికారులకు గ్రామస్తుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఘటనతో ఏమాత్రం సంబంధం లేని అమాయక రైతులను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారంటూ అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. దీనికి స్పందించిన పీసీసీఎఫ్... చెప్పదలచుకున్న విషయాలను రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. దీంతో వారు నిరసన విరమించారు.