
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఏపీ డిప్యూటి సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేశారని కొనియాడారు.
ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలకు 50 శాతం పదవులను కేటాయించలేదని గుర్తుచేశారు. అదేవిధంగా, రాష్ట్రంలో మహిళల తలరాతలు మార్చేలా సీఎం జగన్‌మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని.. మహిళలంతా ఆయనకు అండగా నిలవాలని పుష్పశ్రీవాణి ఆకాంక్షించారు.