
నిండా నష్టాల్లో దొండ రైతులు
కోత ఖర్చులూ రాని దుస్థితి
ఆవేదనలో సాగుదారులు
పెరవలి: దొండ రైతుల పరిస్థితి అతివృష్టి, అనావృష్టి అన్న చందంగా మారింది. మూడు నెలల కిందట 10 కిలోల దొండ కాయలకు మార్కెట్లో రూ.325 ధర పలకగా..ప్రస్తుతం ఎవ్వరూ ఊహించని రీతిలో రూ.50కి పడిపోయింది. అంటే కిలో దొండ కాయలను రూ.5కు రైతు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో ధరలు పడిపోవడంతో దొండ పాదులు ఉంచాలో తొలగించాలో పాలుపోని స్థితిలో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పుడున్న ధరకు కనీసం కోత ఖర్చులు కూడా రావటం లేదని గగ్గోలు పెడుతున్నారు. దిగుబడి సమృద్ధిగా వస్తున్న సమయంలో ధరలిలా పడిపోవడంతో కూలీలు, పురుగు మందుల ఖర్చులకు సరిపోక అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
అందరూ సన్న, చిన్న కారు రైతులే
తూర్పుగోదావరి జిల్లాలో దొండ సాగుచేస్తున్న వారిలో సన్న, చిన్నకారు రైతులే అధికం. వీరు 10 సెంట్ల నుంచి రెండెకరాల విస్తీర్ణంలో పాదులు వేస్తున్నారు. పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, గోపాలపురం, కొవ్వూరు, తాళ్ళపూడి, కడియం, అనపర్తి, సీతానగరం, కోరుకొండ, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో దొండ సాగు ఎక్కువగా జరుగుతోంది. నిత్యం 3 వేల టన్నుల దిగుబడి వస్తోంది.
పెరవలి మండలం ఖండవల్లి, ముక్కామల, లంకమాపల్లి, మల్లేశ్వరం, అన్నవరప్పాడు, కడింపాడు, పిట్టల వేమవరం, కానూరు అగ్రహారం, నల్లాకులవారిపాలెం గ్రామాల్లోని 900 ఎకరాల్లో దొండసాగు చేస్తున్నారు. ఇక్కడి ఖండవల్లి మార్కెట్ నుంచి రాష్ట్రంలోని తిరుపతి, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలు, తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు ప్రముఖ రిటైల్ సంస్థలకు ఎగుమతి అవుతుంటాయి.
దిగుబడి పెరిగింది..ధర తగ్గింది
ఖండవల్లి మార్కెట్‌కు సాధారణంగా ప్రతి రోజూ 70 నుంచి 80 టన్నుల దొండకాయలు వస్తుంటాయి. కానీ, కొన్నాళ్లుగా దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. రోజూ 100 నుంచి 150 టన్నులకు పైగా కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. దీంతో పతనంమైంది. పంట దండిగా చేతికి వచి్చనప్పుడు రేటు పడిపోతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరి్థకంగా తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
చేతికొచ్చేది రూ. 4వేలే..
దొండ సాగుకు పెట్టుబడి అధికం. ఎకరా విస్తీర్ణంలో రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఎకరం దొండ పందిరి నుంచి టన్నుకు పైగా దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. పాదుల్లో కాయలు కోయడానికి 10 మందికి పైగా కూలీలు అవసరం. ఒక్కో కూలీకి రోజుకు రూ.550 ఇవ్వాలి. అంటే 10 మందికి రూ.5,500 చెల్లించాలి.
పాదుల సంరక్షణ, దిగుబడి సాధించాలంటే ఎరువులు, పురుగు మందులు, నీళ్ల తోడికలకు మరో రూ.2 వేలు ఖర్చవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రేటు ప్రకారం టన్ను కాయలు అమ్మితే రూ.5 వేలు మాత్రమే వస్తోంది. ధర గిట్టుబాటు కాకపోవడంతో కొందరు రైతులు దొండ పంటను వదిలేసి, కూలి పనులకు వెళ్తున్నారు. మరికొందరు పాదులు కోసేసి సాగునుంచి అర్థంతరంగా వదిలేస్తున్నారు.
అప్పులు చేసి కూలీలకు ఇస్తున్నాం
కాపుకొచి్చన దొండ పందిరిని చూసి ఆనందించాలో, గిట్టుబాటు ధర లభించడం లేదని బాధ పడాలో తెలియడం లేదు. కూలీలకు, పురుగు మందులు, ఎరువులకు అప్పు చేయాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఒక కోతకు టన్ను దిగుబడి వస్తోంది. మార్కెట్లో అమ్మితే కనీసం కూలీ ఖర్చులకు సరిపడేంత సొమ్ము రావడం లేదు. – చింతా వెంకటేశ్వర్లు, దొండ రైతు, ఖండవల్లి, పెరవలి మండలం