
రేషన్ దుకాణాలకు సరఫరాను నిలిపివేస్తోన్న ప్రభుత్వం
బహిరంగ మార్కెట్‌లో రేటు దిగివస్తున్నా పంపిణీకి విముఖత
2014–19 మధ్య ఇదే తీరుతో వ్యవహరించిన చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) నుంచి ‘కందిపప్పు’ నెమ్మదిగా కనుమరుగు కానుంది. పేదలకు సబ్సిడీపై ఇచ్చే నిత్యావసరాలను ప్రభుత్వం ఆర్థిక భారంగా భావిస్తోంది. అందుకే 10 నెలలుగా క్రమంగా కందిపప్పును తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలకు మాత్రమే కందిపప్పును సేకరిస్తోంది.
టెండర్లకు మంగళం..
కొద్దికాలంగా బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు రేటు కిలో రూ.180కిపైగా పలికింది. ఈ ధర చాలా కాలం పాటు కొనసాగడంతో సామాన్యులు కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో సబ్సిడీపై కందిపప్పును సరఫరా చేసి ఆదుకోవాల్సిన సమయంలోనూ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక రేట్లకు కోట్ చేస్తున్నారని మొత్తం పంపిణీకే మంగళం పాడేసింది.
ప్రజల నుంచి దృష్టి మరల్చేందుకు కందులు సరఫరా చేయాలంటూ కేంద్రానికి లేఖలు పేరిట డ్రామాకు తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) దగ్గరే కందులు నిల్వలు లేనప్పుడు ఏకంగా ఏడాదికి సరిపడా నిల్వలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలంటూ లేఖల్లో కోరడంతోనే ప్రభుత్వ కుటిల నాటకం బయటపడింది.
పేదలకు పంచేది కూడా ఆర్థిక భారమేనా?
ప్రస్తుతం మార్కెట్‌లో కందిపప్పు ధర తగ్గి కిలో రూ.120–130 పలుకుతోంది. ఇది హోల్ సేల్‌లో అయితే రూ.100–110లోపు ఉంటోంది. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై కందిపప్పు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం రేటు దిగివచ్చిన తర్వాత కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి కిలో కందిపప్పు సబ్సిడీపై రూ.67కు వినియోగదారులకు అందించాలి.
అంటే ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో హోల్ సేల్‌లో కొనుగోలు చేసి ఇచ్చినా ప్రభుత్వంపై కిలోకు రూ.40–50 మించి భారం పడదు. ఇది సామాన్య ప్రజలకు ఎంతో కొంత ఊరటనిస్తుంది. కానీ, పేదల జీవితాలను కూడా బడ్జెట్ కోణంలో చూస్తోన్న ప్రభుత్వం ఆ కాస్త మొత్తాన్ని కూడా ఆదా చేసుకునేందుకు పీడీఎస్‌లో కందిపప్పు ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కొత్తేమీ కాదు..
గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 93,000 టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేసింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూలై వరకు అసలు కందిపప్పు పంపిణీ గురించి పట్టించుకోలేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే దీన్ని పంపిణీ చేసింది.
2017–18లో రాష్ట్రంలో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తుండగా మార్చి 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు 2 కిలోల కందిపప్పు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టింది. అంతే తప్ప ఆ ఒక్క ఏడాది కూడా సక్రమంగా కందిపప్పును అందించలేదు.
సబ్సిడీ రేట్లు పెంచిన ఘనుడు బాబుగారే!
ఆగస్ట్ 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున రూ.50–120 మధ్యన రేట్లు పెంచి విక్రయించింది. 2015 డిసెంబర్‌లో ఏకంగా రూ.90కి, 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120కి పెంచేసింది. 2018లో కందిపప్పుకు రూ.23 మాత్రమే రాయితీ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కందిపప్పు రేటు ఎంత పెరిగినా కిలో రూ.67కే స్థిరంగా అందించింది. దీంతో వినియోగదారులకు భారీగా మేలు జరిగింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రాకతో కందిపప్పు పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.