
గురువులతో విజయవాడ పీఠాధిపతి తెలగతోటి జోసఫ్ రాజారావు తదితరులు
గుణదల (విజయవాడ తూర్పు): క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రం విజయవాడ గుణదలలోని మేరీమాత ఆలయంలో ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానాల యం దిగువన ఉన్న బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కతోలిక గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. భక్తుల పాలిట కల్పతరువుగా మేరీమాత కొలువుదీరిందన్నారు.
దేవుని రక్షణ ప్రణాళికలో భాగంగా లోక రక్షకుడైన క్రీస్తును ఈ లోకానికి అందించి లోకమాతగా కీర్తించబడిన మరియతల్లిని ఆశ్రయించిన భక్తుల జీవితాలు దీవెనకరంగా ఉంటాయని తెలిపా రు. గుణదల పుణ్యక్షేత్రం స్థాపించబడి నూరు వసంతాలు పూర్తి కావడం హర్షణీయమన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాలకు హాజరై భక్తులు మరియమాత ఆశీర్వాదాలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, ఫాదర్ సునీల్ రాజు, ఫాదర్ పసల థామస్ తదితరులు పాల్గొన్నా రు. ఉత్సవాల తొలిరోజున యాత్రికులు పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు.