
నేడు, రేపు ఠారెత్తనున్న ఎండలు
వారం రోజుల తర్వాత తగ్గనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: భానుడు రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం చూపనున్నాడు. ఆది, సోమవారాల్లో సాధారణం కంటే 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 20న 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 19 మండలాల్లో వడగాడ్పులు, 21న 10 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 12 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయన్నారు. తీవ్ర వడగాడ్పుల ప్రభావం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఉంటుందని తెలిపారు.
20వ తేదీన విజయనగరం జిల్లాలోని 10 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలోని 2 మండలాల్లో మాత్రమే ఆదివారం వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 21న మన్యం జిల్లాలో 10 మండలాల్లో తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వారం రోజులపాటు అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వారం రోజుల అనంతరం ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలున్నాయని తెలిపారు.