
సంధ్యారాణి.. పక్కన సీసీ టీవీ ఫుటేజీ దృశ్యం
కాకినాడ, సాక్షి: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ.. ఉన్నట్లుండి ఆస్పత్రి నుంచి మాయమైంది. ఆందోళనకు గురైన భర్త, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. కొన్నిగంటల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. అయితే తనకు బలవంతంగా ప్రసవం చేసి పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారంటూ ఆమె కన్నీళ్లు పెడుతుండడంతో ఇటు భర్త, అటు పోలీసులు షాక్‌కు గురయ్యారు.
అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన కుప్పిశెట్టి సంధ్యారాణికి నెలలు నిండడంతో కాన్పు కోసం రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నాం చేర్పించారు. కాసేపటికే ఆసుపత్రి బయట వాకింగ్ చేస్తూ హఠాత్తుగా ఆమె అదృశ్యమైంది.
ఆందోళనకు గురైన భర్త లోవరాజు.. రాజమండ్రి త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో రాత్రి కాకినాడ ఆర్టీసి బస్టాండ్ వద్ద సంధ్యారాణీ ఆచూకీ లభించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కారులో అపహరించారని, తనకు ఇంజెక్షన్ ఇచ్చి డెలివరీ చేశాక పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారని సంధ్యారాణీ ఏడుస్తూ చెబుతోంది.

అనంతరం ఆమెను కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందించారు. అయితే ఆమె చెబుతున్న విషయాలు నిజమో కాదో తెలుసుకునేందుకు.. శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు రాజమండ్రికి తరలించారు. ఈ క్రమంలో సీసీఫుటేజీ కీలకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఓ ఆటోలో ఆమె ఎక్కి వెళ్తున్నట్లుగా దృశ్యాలు అందులో రికార్డు అయినట్లు కనిపిస్తోంది.