
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బొల్లినేని కిమ్స్‌లో మృతి చెందిన ఫార్మసిస్ట్ నాగాంజలి కేసులో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకుందన్న సమయంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. ఈ సమయంలో నాగాంజలికి ఏం జరిగిందో వాస్తవాలు వెల్లడికాలేదు. సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్యలో నాగాంజలికి ఎలాంటి చికిత్స జరిగింది?. ట్రీట్మెంట్ ఎవరిచ్చారు?. వార్డు నెంబర్ 802లో నాగాంజలికి అనస్థీషియా ఇంజెక్షన్ ఎవరు చేశారో? ఇప్పటివరకు స్పష్టం కాలేదు.
బాధితురాలు తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. ఆ రూమ్‌లో సీసీ ఫుటేజ్ ఏమైనట్టు?. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే దీపక్‌తో పాటు ఎవరెవరు ఈ దారుణానికి సహకరించారో బయటపడే అవకాశం ఉంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం 6:30కు అంజలి ఫోన్‌తో దీపక్ క్యాజువాలిటీకి ఎందుకు వచ్చాడు?. ఆసుపత్రి యాజమాన్యం సకాలంలో ట్రీట్మెంట్ చేస్తే అంజలి బతికేదా?. నాగాంజలిది ఆత్మహత్యా? లేక హత్యా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.
కాగా, మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి నిన్న(శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచింది. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది.