
ప్రచారం పేరుతో ఇంట్లోకి చొరబడి మహిళతో అనుచిత ప్రవర్తన, దాడి
బోడె ప్రసాద్, పార్థసారథి అనుచరుడు గుమ్మడి కిరణ్ వీరంగం
కంకిపాడు: టీడీపీ కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. నేతల అండ చూసుకుని దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అధికారంలోకి రానివ్వండి తేలుస్తాం.. అంటూ పెనమలూరు నియోజకవర్గంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రచారం పేరుతో ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి దాషీ్టకం ప్రదర్శించాడు. ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేయడమేగాక ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ అవుతోంది. కంకిపాడుకు చెందిన గుమ్మడి కిరణ్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో టీడీపీ ప్రచారం పేరుతో.. మహిళ ఒంటరిగా ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. నువ్వు ఫోన్ చేస్తే వచ్చానని, ఫోన్‌లో డబ్బులు వేశానని అంటూ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. సామగ్రి ధ్వంసం చేసి భయాందోళనలకు గురిచేశాడు. అతడి చేష్టల్ని వీడియోలో చిత్రీకరిస్తున్న ఆమెను తిడుతూ.. తనకు యార్లగడ్డ, బోడె, పార్థసారథి అండ ఉందని హెచ్చరించాడు. ఆమెపై దాడిచేసి కొట్టాడు. తెలుగుదేశం వర్గీయుల దౌర్జన్య వ్యవహారాలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి.