
నాళంవారి సత్రం భూముల వేలంపై సందిగ్ధం
దొడ్డిదారిన లీజుకు భూములు కొట్టేసే ఎత్తుగడ
యనమల ఇలాకాలో టీడీపీ నేతల స్కెచ్
అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్న వైనం
సాక్షి, ప్రతినిధి, కాకినాడ: నాళంవారి సత్రం భూములను దొడ్డిదారిన కొట్టేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. వేలం లేకుండా దక్కించుకోవాలని శతవిధాలా యత్నిస్తున్నారు. రాజమహేంద్రవరం నాళం వారి సత్రానికి గోదావరి జిల్లాల్లో మంచి పేరు ఉంది. దీనికి రెండు జిల్లాల్లోనూ వందల ఎకరాల మాగాణి భూములు ఉన్నాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం శృంగవృక్షంలో 268.64 ఎకరాల భూమి ఈ సత్రానికి ఉంది. ఈ భూములను వేలం నిర్వహించి మూడేళ్ల కాల పరిమితికి లీజుకు ఇస్తుంటారు.
ప్రస్తుత లీజు కాలం ఈనెల 29తో ముగుస్తుంది. దీంతో ఈనెల 29న భూములకు వేలం నిర్వహించేందుకు సత్రం కార్యనిర్వహణాధికారి చందక దారబాబు కరపత్రాలు పంచిపెట్టారు. 10 ఎకరాలలోపు రూ.5 లక్షలు పూచీకత్తు, 10 ఎకరాలు దాటితే రూ.10 లక్షలు పూచీకత్తు చెల్లించాలని, హెచ్చుపాటదారు మొదటి సంవత్సరం లీజు సొమ్ము చెల్లించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వర్గీయులు వేలం లేకుండా భూములు దక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. ఈఓ దారబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వేలం నిర్వహించడం కుదరదని, తాము చెప్పే వారికి భూములు కట్టబెట్టాలని దేవస్థానం అధికారులకు యనమల హుకుం జారీ చేశారని సమాచారం.
సారవంతమైన భూములు
రెండు పంటలు పండే సారవంతమైన భూములు కావడంతో వీటిపై టీడీపీ నేతల కన్ను పడింది. వాటిని ఏదో రకంగా దక్కించుకోవాలని పన్నాగం పన్నుతున్నారు. తమ పార్టీ సానుభూతిపరులైన అరడజను మంది రైతులకు వేలంతో సంబంధం లేకుండా భూముల లీజు హక్కులు రాసిచ్చేయాలని అధికారులపై యనమల ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 29న బహిరంగ వేలం జరుగుతుందా లేదా అనే సందిగ్థత నెలకొంది.
ఒత్తిళ్లకు లొంగేది లేదు
ఈ నెల 29న బహిరంగ వేలం నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించి వేలం నోటీసులు గ్రామ పంచాయతీలో అతికించాం. కరపత్రాలు గ్రామంలో అందరికీ అందేటట్టు ఏర్పాటు చేశాం. ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేదు. గతం కంటే హెచ్చుపాట రాకపోతే మళ్లీ వేలం నిర్వహిస్తాం. పాట దక్కించుకున్న వ్యక్తి మొదటి ఏడాది లీజు మొత్తం జమ చేస్తేనే భూములు అప్పగిస్తాం. – చందక దారబాబు, కార్యనిర్వహణాధికారి, నాళంవారి సత్రం, రాజమహేంద్రవరం