
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: జగ్గయ్యపేట పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కోల్డ్ స్టోరేజ్‌లో మిర్చి బస్తాలు తగలబడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
తొర్రగుంటపాలెంలోని సాయి తిరుమలగిరి అగ్రి ప్రొడక్ట్స్ కోల్డ్ స్టోరేజ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు నలభై వేల మిర్చి బస్తాలు తగలబడినట్లు సమాచారం. నాలుగు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. మిర్చి ఘాటుకు తుమ్ములు, దగ్గులతో పరిసరి గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నష్టంపై ఇప్పుడే అంచనాకి రాలేమంటున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.