రొయ్యకు లోకల్‌ మార్కెట్‌ | Prawn door delivery service launched a year and a half ago | Sakshi
Sakshi News home page

రొయ్యకు లోకల్‌ మార్కెట్‌

Published Sat, Apr 19 2025 4:01 AM | Last Updated on Sat, Apr 19 2025 4:01 AM

Prawn door delivery service launched a year and a half ago

స్థానిక వినియోగం పెంచే ప్రయత్నాలు 

ఏడాదిన్నర క్రితమే రొయ్యల డోర్‌ డెలివరీకి కార్యాచరణ  

పైలెట్‌ ప్రాజెక్టుగా భీమవరం ఎంపిక  

ఎన్నికలు రావడంతో నిలిచిన ప్రక్రియ 

తర్వాత పట్టించుకోని కూటమి ప్రభుత్వం  

సాక్షి, భీమవరం: రొయ్య ధరల స్థిరీకరణకు స్థానిక వినియోగం పెంచడం మంచి పరిష్కారమని చెబుతున్నా­రు. ఆ దిశగా ప్రముఖులతో ప్రమోషన్‌ చేయించాలని, చికెన్‌ షాపుల్లోనూ రొయ్యల అమ్మకాలు చేయాలని ప్రా­న్స్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ నిర్ణయించింది. గత వైఎస్సార్‌సీ­పీ ప్రభుత్వంలో సిద్ధంచేసిన లోకల్‌ మార్కెట్‌ కాన్సెప్‌్టను ఇప్పుడు కూటమి కమిటీ తెరపైకి తెస్తోంది. ఏడాదికి ఒ­క్కొ­క్కరు 10–12 కిలోల సగటు వినియోగంతో రొయ్యలు ఎక్కువగా తినే దేశాల్లో చైనా టాప్‌లో ఉంటే, 8–10 కిలోలతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 

యూరోపియన్‌ దేశా­ల్లోనూ సగటున ఒక్కొక్కరు ఎనిమిది కిలోల వరకు తీసుకుంటారు. ప్రపంచ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే మనదేశంలో మాత్రం సగటు వినియోగం 800 గ్రాములు మాత్రమే. ఆ­క్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న ఏపీలో వినియోగం 1.5 కిలోలు ఉన్నట్లు ఫిషరీస్‌ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే అత్యధికంగా ఉ­మ్మ­డి పశ్చిమగోదా­వ­రి జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. 

ఏటా సుమారు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా మొదటి స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో నకిలీ సీడు, ఫీడు, దళారుల దోపిడీతో కుదేలైన ఆక్వా రంగానికి గత ప్రభుత్వం కొత్త ఊపిరిలూదింది. ఏపీ స్టేట్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారటీ (అప్సడా) ఏర్పాటు చేసి రొయ్య ధరలను లాభసాటి చేయడంతో పాటు, మేత ధరలను తగ్గించి, ఫీడ్‌ కంపెనీలు ఇష్టానుసారం పెంచకుండా నియంత్రించింది. నాన్‌ ఆక్వా జోన్‌ పరిధిలోని వేలాది ఎకరాలను ఆక్వా జోన్‌ పరిధిలోకి తెచ్చి విద్యుత్‌ రాయితీ అందజేసింది. 

రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్‌ అందేలా చర్యలు తీసుకుంది. ఫిష్‌ ఆంధ్రా ద్వారా డొమెస్టిక్‌ వినియోగం పెంచేందుకు మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 60 శాతం, మిగిలిన వారికి 40 శాతం రాయితీపై జిల్లా వ్యాప్తంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు విలువైన 250కు పైగా అవుట్‌లెట్లు ఏర్పాటుచేశారు. ఫోర్‌ వీలర్స్, టూ వీలర్స్‌ సబ్సిడీపై అందించారు. 

రొయ్యల డోర్‌ డెలివరీకి కార్యాచరణ 
క్వాలిటీ రొయ్యలను స్థానికంగా సామాన్య వినియోగదారుల చెంతకు చేర్చేలా రొయ్యల డోర్‌ డెలివరీకి ఏడాదిన్నర క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్యాచరణ చేసింది. ప్రభుత్వ సహకారంతో ఈ ప్రక్రియ అమలుకు ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్‌ అప్పట్లో ముందుకు వచ్చింది. ఎక్స్‌పోర్టు తరహాలో ప్రాసెస్‌ చేసిన రొయ్య పప్పు కిలోకు కౌంట్‌ను బట్టి రూ.600 నుంచి రూ.850 వరకు ధర నిర్ణయించారు. 

తొలుత జిల్లాలోని భీమవరం పరిసర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ నగరాలు, పట్టణాలకు విస్తరింప చేయా లని భావించారు. 2023 ఏడాది చివర్లో మత్య్సశాఖ జిల్లా అధికార వర్గాలు అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈలోగా ఎన్నికలు హడావుడి మొదలు కావడంతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు.

మరుగున పడేసిన కూటమి 
కూటమి ప్రభుత్వం రొయ్యల స్థానిక వినియోగం పెంచే కార్యాచరణను మరుగున పెట్టేసింది. అమెరికా ప్రతీకార 
సుంకాలు అమలులోకి రాకపోయినా వాటిని సాకుగా చూపించి రెండు వారాలుగా ఎగుమతిదారులు రొయ్య ధరలను కౌంట్‌కు రూ.40 నుంచి రూ.90 వరకు తగ్గించి కొనుగోలు చేస్తుండటం పట్ల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మేత ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో మంగళవారం విజయవాడలో భేటీ అయిన ప్రాన్స్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా కార్యాచరణ నిర్ణయించడం గమనార్హం. 

రొయ్యల ప్రాముఖ్యతను వివరిస్తూ సినీ నటులు, ప్రముఖులతో ప్రమోషన్‌ చేయించాలని, 100, 250, 500 గ్రాములుగా ప్యాకెట్లు చేసి విక్రయించాలని, చికెన్‌ షాపుల్లో సైతం వీటిని అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వం కోవిడ్‌ సమయంలో సైతం రొయ్య ధరలు తగ్గకుండా రైతులకు అండగా నిలిచి మద్దతు ధర అందించింది. 

తర్వాతి కాలంలో ధరలు తగ్గించకుండా ఎక్స్‌పోర్టర్స్‌పై నియంత్రణ ఉంచింది. స్థానిక వినియోగం పెంచేందుకు కృషిచేసింది. అదే మాదిరి కూటమి ప్రభుత్వం స్థానిక వినియోగంతో పాటు ఎక్స్‌పోర్టర్స్‌పై ఒత్తిడి తెచ్చి రొయ్య ధరలను రైతులకు లాభసాటి చేసేందుకు కృషిచేయాలని రైతులు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement