కశ్మీరుకు కాదు కోనసీమకు.. | Plans for a trip to Konaseema with the latest developments | Sakshi
Sakshi News home page

కశ్మీరుకు కాదు కోనసీమకు..

Published Sun, Apr 27 2025 6:08 AM | Last Updated on Sun, Apr 27 2025 6:08 AM

Plans for a trip to Konaseema with the latest developments

ఈ వేసవిలో ఓ టూర్‌ వేసేద్దాం అంటున్న పర్యాటకులు

తాజా పరిణామాలతో కోనసీమ పర్యటనకు ప్రణాళికలు

పరవశింపజేసే ప్రకృతి అందాలు తిలకిద్దామని ఆలోచన  

ఒంపు సొంపుల గోదావరి నదీ పాయల పరవళ్లు..

అలలపై హౌస్‌బోట్లు.. మైమరపించే పిల్ల గాలులు..

సమ్మోహనపరిచే సూర్యోదయ, సూర్యాస్తమయాలు..

అలసిన మనసును తేలికచేసే సుందర ప్రదేశాలు..

కొబ్బరి తోటలతో అల్లుకున్న అందమైన తీరాలు..

పచ్చటి తివాచీ పరుచుకున్నట్లుండే కోనసీమ....

రా రమ్మని పిలుస్తోంది..! ఆతిథ్యానికి సిద్ధం అంటోంది..

మలికిపురం: గోదావరి తరగలపై.. బోట్ల మీద లాహిరి లాహిరిలో అంటూ షికారు చేస్తే.. ఆ హాయి చెప్పలేనిది. ఈ అనుభూతిని పొందేందుకు కోనసీమకు వస్తున్నాం అంటున్నారు పర్యాటకులు. వేలాదిమంది రాకపోకలతో వేసవి సీజన్‌ గోదావరి జిల్లాలలో టూరిస్ట్‌ కేంద్రాలు, చుట్టుపక్కల పట్టణాల్లో హోటళ్లకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంది. ఈసారి కూడా అలానే కాస్త ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. 

అఖండ గోదావరి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద మూడు ప్రధాన పాయలుగా చీలి.. పల్లెల మీదుగా.. పచ్చని పొలాల మధ్య ప్రవహిస్తూ.. కోనసీమ జిల్లాలో సాగర సంగమం చేసే ప్రదేశాలను కనులారా వీక్షించాలని భావిస్తున్నారు. సెలవులు ప్రారంభం కావడంతో ప్రకృతి ప్రేమికులు పొలోమంటూ బృందాలుగా  సిద్ధమవుతున్నారు. 

దిండి.. ఆతిథ్యం దండి.. 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని వశిష్ట నదీ తీరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన ప్రముఖ పర్యాటక కేంద్రం దిండి. ఇక్కడ కేరళను తలదన్నేలా ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేసవి వచ్చిందంటే చక్కటి విడిది కేంద్రంగా మారుతుంది. కార్పొరేట్‌ హోటళ్లను తలదన్నే రీతిలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ టూరిజం శాఖ అన్ని సౌకర్యాలు కల్పించింది. 

హరిత కోకోనట్‌ కంట్రీ రిసార్ట్స్, సరోవర్‌ పోర్టికో వంటి గ్రూప్‌ హోటల్స్‌లో ఏసీ గదులు, ఏసీ సూట్‌లు అందుబాటులో ఉన్నాయి. గోదావరిలో కొత్త జంటలు ఏకాంతంగా విహరించేందుకు ఒక్కొక్కటి రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు భారీ హౌస్‌ బోట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా గ్రూప్‌ ఫంక్షన్లు ఏర్పాటు చేసుకునేందుకు ఫాంటూన్‌ బోటు ఉంది. నదిలో దూసుకెళ్లేందుకు స్పీడ్‌ బోట్, జెట్‌ స్కీ ఆత్రేయ బోట్లు అందుబాటులో ఉన్నాయి. గత 15 ఏళ్లలో రాష్ట్రం, దేశం నలుమూలల నుంచి వేలాదిమంది దిండిని సందర్శించారు.  

నాడు వైఎస్‌ వేసిన బీజం.. నేడు యువతకు ఉపాధి 
2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దిండి టూరిజానికి బీజం వేశారు. అది ఇప్పుడు వట వృక్షం మాదిరిగా ఎదిగింది. అప్పట్లో రూ.4 కోట్లతో రిసార్ట్‌ నిర్మించి, నాలుగు బోట్లు పెట్టించారు. తర్వాతరూ.10 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం రూ.వందల కోట్లతో ప్రైవేటు టూరిజం ప్రాజెక్టులు వచ్చాయి. 

ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. గదులు, వసతులు సరిపోకపోవడంతో ప్రస్తుతం మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. టూరిజం కేంద్రాలున్న గ్రామాల్లో, గోదావరి, సముద్ర తీర సమీపాన చిన్న హౌస్‌లు నిర్మించుకునేందుకు బ్యాంకు రుణం ఇచ్చేందుకు, లోకల్‌ మేడ్‌ ఫుడ్‌ వ్యాపారాలు పెట్టుకుని ఆదాయం పొందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఆధ్యాత్మిక పర్యాటకం 
టూర్‌కు వచ్చినవారు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. పర్యాటకుల రద్దీతో హోటల్స్, రిసార్ట్స్‌ నిర్వాహకులు నూరు శాతం ఆక్యుపెన్సీ పొందుతున్నారు. వేసవిలో దిండి చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేటు టూరిజం ద్వారా రూ.20 కోట్లపైగా టర్నోవర్‌ జరుగుతుందని అనధికారిక అంచనా. 

దిండికి దారి... 
దిండి పర్యాటక కేంద్రం కోనసీమ–పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య మలికిపురం మండలం వశిష్ట గోదావరి తీరంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి వచ్చే పర్యాటకులు పాలకొల్లు రైల్వే స్టేషన్‌లో దిగి ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో రావచ్చు. పాలకొల్లు ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి రాజోలు వచ్చే బస్సులు ఎక్కి దిండిలో దిగవచ్చు.

 రాజమహేంద్రవరం మీదుగా వచ్చేవారు రాజోలు చేరుకుని, అక్కడినుంచి పాలకొల్లు వెళ్లే బస్సు ఎక్కి దిండిలో దిగవచ్చు. దిండి పాలకొల్లు నుంచి 15 కిలోమీటర్లు, రాజోలు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖ నుంచి వచ్చే పర్యాటకులు కాకినాడ, అమలాపురం, రాజోలు మీదుగా దిండికి చేరుకోవచ్చును. ప్రత్యేక ఆటోలు కూడా ఉన్నాయి. 

రిసార్ట్స్‌లో గదుల రేట్ల వివరాలు 
ఏసీ స్టాండర్డ్‌ రూమ్‌ : రూ.2800 (24 గంటలు) 
ఏసీ డీలక్స్‌ రూమ్‌: రూ.3,884 (24 గంటలు) 
రిసెప్షన్‌ నంబరు : 98487 80524 
హౌస్‌ బోట్ల రేట్ల వివరాలు
24 గంటల ప్యాకేజీ: రూ.15 వేలు (ఉదయం 10 నుంచి మర్నాడు ఉదయం 9   వరకు) 
12 గంటల ప్యాకేజీ: రూ.12 వేలు (ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు) 
» బోటులో రెండు గదులు, అటాచ్డ్‌ బాత్‌రూములు, డైనింగ్‌ హాలు ఉంటాయి. రెండు జంటలు నలుగురు పిల్లలతో ఒకేసారి విహరించవచ్చు. 
»     ఫాంటూన్‌ బోటు, ఆత్రేయ బోట్లలో ట్రిప్‌ల వారీగా రూ.80 పైగా టికెట్‌ ధరలు ఉంటాయి. ఫాంటూన్‌ బోటులో గంటకు రూ.2,500 ఉంటుంది. 
»   లగ్జరీ బోటు: నదిలో పలువురు పర్యాటకులు గ్రూపుల వారీగా అలా ట్రిప్‌నకు వెళ్లి రావచ్చు. ఒక్కొక్కరికీ టికెట్‌ రూ.150. 
స్పీడ్‌ బోటు: ఇది కూడా నదిలో మూడు కిలోమీటర్ల దూరం ఒకేసారి ముగ్గురిని మూడు నిమిషాల్లో తిప్పి తీసుకొస్తుంది. ట్రిప్‌నకు రూ.350. 
»   పిల్లలు, పెద్దలు జలకాలాడేందుకు స్విమ్మింగ్‌ పూల్‌ ఉంది. 
»  ఆకలేస్తే కోనసీమ వంటకాలు ఆరగించేందుకు రెస్టారెంట్లు ఉన్నాయి. 

పుణ్యక్షేత్రాలు: దిండికి దాదాపు 60 కిలోమీటర్ల పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం దిండి నుంచి 18 కిలోమీటర్లు.  అంతర్వేదిలో గోదా­వరి నదీ సాగర సంగమం, బీచ్, సముద్ర తీరంలోని బ్రిటీష్‌ కాలం నాటి నౌకా దిక్సూచి లైట్‌ హౌస్‌లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇంకా అయినవిల్లి, అప్పనపల్లి, వాడపల్లి, ద్రాక్షరామ, పిఠాపురం, సామర్లకోట, మందపల్లి పు­ణ్య­క్షే­త్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఆహో అనేలా హోటళ్లు.. 
ఆన్‌లైన్‌ విధానం రావడంతో పాలకొల్లు, నర్సాపురం, రాజమహేంద్రవరం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు రైల్వే స్టేషన్ల నుంచి, రాజమహేంద్రవరం, గన్నవరం విమానాశ్రయాల నుంచి దిండి చుట్టుపక్కల విహార కేంద్రాల్లో హోటల్స్‌ బుక్‌ చేసుకుంటున్నారు. అంతర్వేది సాగర సంగమం, లొల్ల లాకులు, కోరంగి అడవుల్లో పచ్చటి అందాలను వీక్షిస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. 

కేరళకు దీటుగా.. 
దిండి టూరిజం కేంద్రం ద్వారా కోనసీమ, గోదావరి జిల్లాల టూరిజం కేరళకు దీటుగా ఎదిగింది. పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రకృతి ప్రేమికులతో పాటు టెంపుల్‌ టూరిజం కూడా అభివృద్ధి చెందింది. వేసవిలో ఆక్యుపెన్సీ గణనీయంగా ఉంటుంది. తదనుగుణంగా ఏర్పాట్లు చేశాం.  – కె.మురళీధర్, ఏపీ టూరిజం మేనేజర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement