
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. నెలన్నర రోజులుగా వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకుంటున్నాయి.
ఈ తరుణంలో ఒకపక్క వడగాడ్పులు కొనసాగుతూనే మరోపక్క ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పతున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది.
ఈ నెల 7న (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. 28 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 187 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఆదివారం 30 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 247 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. సోమవారం 15 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 69 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.