
వాంగ్మూలాల పేరిట పచ్చ కుతంత్రం
మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో కుయుక్తులు
సంతకాలు చేసేందుకు నిరాకరిస్తున్న నిందితులు
రిమాండ్ రిపోర్టులన్నీ అబద్ధాల పుట్టలే..
సాక్షి, అమరావతి: టీడీపీ వీరవిధేయ సిట్ కట్టుకథలు అంతూ పొంతూ లేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు నివేదికల పేరిట అవాస్తవాలు, అభూతకల్పనలతో కనికట్టు చేసేందుకు బరితెగిస్తోంది. ఆ కేసులో అక్రమంగా అరెస్టు చేస్తున్నవారి వాంగ్మూలాల పేరిట న్యాయస్థానానికి సమర్పిస్తున్న రిమాండ్ రిపోర్టులే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. మొన్న రాజ్ కేసిరెడ్డి.. నిన్న చాణక్య.. నేడు శ్రీధర్ రెడ్డి.. ఈ ముగ్గురి రిమాండ్ రిపోర్టులు పరిశీలిస్తే ప్రభుత్వ కుతంత్రం బయటపడుతోంది.
అంతా కనికట్టే!
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. దీనికోసం టీడీపీ వీరవిధేయ అధికారులతో కూడిన సిట్ ద్వారా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ కేసులో న్యాయస్థానానికి సమర్పించిన వరుసగా మూడో రిమాండ్ రిపోర్ట్ కూడా సిట్ కుయుక్తులను బయటపెట్టింది. ఈ కేసులో ఆరో నిందితుడిగా శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో శనివారం హాజరు పరుస్తూ సిట్ రిమాండ్ రిపోర్టు సమర్పిoచింది. అంతకుముందు రాజ్ కేసిరెడ్డి, చాణక్య రిమాండు రిపోర్టుల్లో పేర్కొన్న అవాస్తవ ఆరోపణలు, కల్పిత అభియోగాలనే శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ సిట్ పునరుద్ఘాటించింది.
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ అవాస్తవాలను వండి వార్చింది. పైగా అవన్నీ కూడా శ్రీధర్‌రెడ్డి తమ విచారణలో వెల్లడించారని సిట్ పేర్కొనడం గమనార్హం. కానీ ఆ వాంగ్మూలంపై సంతకం చేసేందుకు శ్రీధర్ రెడ్డి నిరాకరించారని ఆ నివేదికలో పేర్కొంది. మధ్యవర్తుల సమక్షంలో తాము వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపింది. అంటే ఈ కేసులో కుట్ర క్రమం అంటూ సిట్ వివరించిన విషయాలేవీ వాస్తవం కాదని స్పష్టమైంది.
వాటిని శ్రీధర్‌రెడ్డి చెప్పనే లేదని.. అందుకే ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారన్నది బయటపడింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేస్తూ సిట్ అధికారులే అవాస్తవాలు, అభూతకల్పలను వాంగ్మూలంగా నమోదు చేసేశారని స్పష్టమైంది. ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య కూడా చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్ ఏకపక్షంగా వారి పేరిట వాంగ్మూలంగా నమోదు చేసింది. కానీ తాము సంతకాలు చేయలేదనే విషయాన్ని వారే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే సిట్ అధికారులు ఆ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో తప్పనిసరై వెల్లడించారు.
ఇంత బరి తెగింపా..!
ఇంత నిర్భీతిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ దర్యాప్తు పేరుతో అటు న్యాయస్థానాలను ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అధికారులు యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. ఆ అబద్ధపు వాంగ్మూలాలను టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడమే సిట్ లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. ఈ కేసు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తుంది కేవలం రెడ్ బుక్ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది.