
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఉండవల్లి లేఖ
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రాన్ని విభజించిన తీరు, తద్వారా ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ జరిగేలా నోటీసు ఇప్పించాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఈ మేరకు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు రాసిన లేఖను మంగళవారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. 2014 నుంచి జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు.
‘2014 ఫిబ్రవరి 18న రాష్ట్ర విభజన బిల్లుపై ఎటువంటి చర్చా జరగకుండా.. ఎంతమంది విభజనకు అనుకూలమో.. ఎంతమంది వ్యతిరేకమో డివిజన్ ద్వారా లెక్క తేల్చకుండా, తలుపులు మూసేసి టీవీ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి, రాష్ట్ర విభజన జరిగిపోయిందని లోక్‌సభలో ప్రకటించారు. ఈ విషయం మీకు తెలిసిందే..’ అని లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేళ్లుగా నడుసూ్తనే ఉన్నా... కేంద్రం నేటికీ కనీసం కౌంటర్ దాఖలు చేయలేదు.
2018 ఫిబ్రవరి 18న మీరు(పవన్) ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన బకాయిలు రూ.74,542 కోట్లుగా లెక్క తేల్చింది. 2018 జూలై 16న అప్పటి సీఎం చంద్రబాబును కలిసి లోక్‌సభలో జరిగిన దుర్మార్గం గురించి వివరించాను. నేను చూపించిన లోక్‌సభ రికార్డులను పరిశీలించిన చంద్రబాబు నా వాదనతో ఏకీభవించి, లోక్‌సభలో ఈ విషయం చర్చించేందుకు నోటీసు ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. కారణాలేమైనా అవి అమలు కాలేదు.
2019 జనవరి 29న విజయవాడలో నేను ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్సార్‌సీపీ, సీపీఎం తప్ప మిగిలిన ముఖ్య పార్టీల నేతలందరూ హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీరు స్వయంగా హాజరయ్యారు. 2019 ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా, మనకు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చించాలని, సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని ఆ రోజు సమావేశంలో తీర్మానించుకున్నాం. ఇప్పుడు మీరు, చంద్రబాబు ఇద్దరూ బీజేపీతో కలిసి రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోను, సహకరించిన బీజేపీ కేంద్రంలోను అధికారంలో ఉన్నాయి.
రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సరైన సమయం. మీరిద్దరూ శ్రద్ధ తీసుకుని, పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర విభజనపై, జరిగిన అన్యాయంపై చర్చకు నోటీసులు ఇప్పించాలి. దీంతోపాటు సుప్రీంకోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలి.’ అని ఉండవల్లి ఆ లేఖలో పేర్కొన్నారు.