
మైనర్ బాలికపై మేనమామ లైంగిక దాడి
మరొక మైనర్‌పై అత్యాచారయత్నం
బయటకు పరుగులు తీసిన బాధితురాలు
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన స్థానికులు
తాడేపల్లి రూరల్: మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి సోదరిపైన కూడా అత్యాచారం చేయబోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అంజిరెడ్డి కాలనీలో ఇటీవల జరగ్గా..ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు..కాలనీలోని ఓ మహిళ తన భర్తను వదిలేసి..తండ్రి రెండో భార్య కుమారుడు కొండపాటి లంకబాబుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఆ మహిళకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పదేళ్లు. రెండవ కుమార్తెకు తొమ్మిదేళ్లు. వీరి తల్లి మద్యానికి బానిస అయ్యింది.
చిన్నారులకు మేనమామ వరుస అయ్యే లంకబాబు పదేళ్ల చిన్నారిపై తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బుధవారం తల్లి మద్యం తాగి ఉన్నప్పుడు ఆమె రెండో కుమార్తెతో లంకబాబు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ చిన్నారి ఇంట్లో నుంచి పరుగులు తీసి బయటకు వచ్చి పక్క ఇంట్లో మహిళలకు చెప్పింది. దీంతో వారు లంకబాబును చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. ఈలోగా లంకబాబు పరారయ్యాడు.
లంకబాబు ఆ మహిళ పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆ చిన్నారి భయంతో బయటకు చెప్పలేక తీవ్ర ఇబ్బందులు పడిందని, పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో బాధిత చిన్నారులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఏం జరిగిందో తెలుసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లంకబాబు కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అదుపులోకి తీసుకుని ఆయనపై పోక్సో కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.