టీడీపీ, జనసేన ఆన్‌లైన్‌ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! | Women Suicide With TDP Janasena Social Media Harassment | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన ఆన్‌లైన్‌ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!

Published Tue, Mar 12 2024 5:13 AM | Last Updated on Tue, Mar 12 2024 12:14 PM

Women Suicide With TDP Janasena Social Media Harassment - Sakshi

గీతాంజలిని సోషల్‌ మీడియాలో వేధిస్తూ జనసేన, ఐటీడీపీ కార్యకర్తలు పెట్టిన అసభ్యకర పోస్టులు

జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పటమే ఆమె నేరం

అమ్మ ఒడి, చేయూత, పింఛన్‌తో కుటుంబం బాగుపడిందనటమే తప్పయ్యింది

ఓ యూట్యూబ్‌ చానల్‌కు సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి

సోషల్‌ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ, జనసేన మూకలు

ఆమెను దూషిస్తూ... వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్‌

మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం.. ఆనక ఆస్పత్రిలో మృతి

సీఎం సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే

బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసా  

సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, అమరావతి: ఆమె చేసిన తప్పల్లా... తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లలో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చంద్ర­బాబు, పవన్‌ కళ్యాణ్‌ల సోషల్‌ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధికుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతీజాతీ లేని ఈ ఆన్‌లైన్‌ మారీచులు.... తాము మనుషులమన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదికమీదా ఆమెను నానా దుర్భాషలాడారు.

అక్కచెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే లేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు. ఆమె వేషభాషలను ఎగ­తాళి చేస్తూ, అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశా­రు. భరించలేని ఆ ఆడ­బిడ్డ మరణమే శరణ్యమనుకుంది. రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మ­హత్య కాదు. టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా మూకలు వెంటాడి వెంటాడి చేసిన దారుణమైన హత్య. 

గొల్తి గీతాంజలి (30) భర్త చంద్రశేఖర్‌ తెనాలిలోని వహాబ్‌ పార్క్‌ ప్రాంతంలో బంగారం పని చేస్తుంటారు. వాళ్లకిద్దరు పిల్లలు. గీతాంజలి కొద్దిరోజుల కిందట ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు ఇంటి­పట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మ ఒడి వస్తోందని, అత్తమామలకు చేయూత, పింఛన్‌ కానుక అందుతున్నాయని చెబుతూ సీఎం వైఎస్‌ జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే అన్నా­బత్తుని శివకుమార్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.



జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తామంటూ.. ఆమె ఎదురు ప్రశి్నంచిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన కిరాయి మూకలు సోషల్‌ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్‌ చేశాయి.  వాస్తవానికి గీతాంజలికి గతంలోనే ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందచేసింది.

ఈ నెల 4న కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్‌ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఈ ఇంటర్వ్యూ వ్యవహారం చోటుచేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితోపాటు ఎమ్మెల్యే శివకుమార్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిజిస్ట్రేషన్‌ పట్టాను అందుకున్నాక తన సం­తో­­షాన్ని ఓ యూట్యూబ్‌ చానల్‌తో పంచుకుంది.

కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కల నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్నను గెలిపించుకోవటం తమ బాధ్య­తని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మఒడి ఆస­రాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జై జగన్‌.. అని నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడి­యా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడంతో తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న టీడీపీ, జనసేన ‘సోషల్‌ మాఫియా’ బాధితురాలిని దారుణంగా ట్రోల్‌ చేసింది.

ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పడుతూ, రాయలేని భాష­లో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటా­­హుటిన ఆమె­ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.

తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్‌ మీడియాలో అసభ్యకర సందేశాల కారణంగా ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యా­దు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్ల తాను, తన కుటుంబం లబ్ధి పొందినట్లు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. గీతాంజలిని ఆత్మహత్యకు పురిగొల్పేలా దారుణ వ్యాఖ్యలతో వికృతంగా వ్యవహరించిన సోషల్‌ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.  
గీతాంజలిని బూతులు తిడుతూ టీడీపీ, జనసేన అభిమానులు పెట్టిన  పోస్టులు, కామెంట్లు.. గీతాంజలి మృతదేహం వద్ద రోదిస్తున్న ఇద్దరు కుమార్తెలు   

పచ్చ మీడియాపై బాధిత కుటుంబం ఆగ్రహం 
ఇద్దరు చిన్నారులతో ఎంతో చలాకీగా అందరితో కలిసి మెలసి ఉండే గీతాంజలిని సోషల్‌ మాఫియా పొట్టన పెట్టుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌ మార్చురీ వద్ద కన్నీరు మున్నీరయ్యారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లల గతి ఏం కావాలంటూ విలపించారు. సోషల్‌ మీడియా ఆమెను పొట్టనపెట్టుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పచ్చ సోషల్‌ మీడియా కళ్లు ఎప్పుడు పచ్చగానే ఉంటాయని, పేదింటి మహిళకు ఇంత సంతోషం దక్కడం వారికి ఇష్టం లేదంటూ మండిపడ్డారు. గీతాంజలికి తల్లితండ్రి దూరంగా ఉండటంతో అమ్మమ్మ, తాతయ్య, మేనమామ కలిసి వివాహం చేశారని, గీతాంజలి సంతోషం పచ్చ సోషల్‌ మీడియాకు కంటగింపుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారులు 
ఐటీడీపీ, జనసేన సోషల్‌ మీడియా ట్రోలింగ్‌తో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి అంతిమ సంస్కారాలు సోమవారం రాత్రి జరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష అనంతరం చినరావూరుతోటలోని హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను భర్త బాలచంద్ర నిర్వహించారు. తల్లి భౌతికకాయాన్ని చూసి చిన్నపిల్లలైన కుమార్తెలు రిషిత, రిషిక హృదయ విదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అక్కడకు చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం ఆదేశానుసారం మంగళవారం వారి ఇంటికి వచ్చి బిడ్డల భవిష్యత్‌ కోసం ఏం చేయాలనే అంశంపై మాట్లాడతానని హామీ ఇచ్చారు.

టీడీపీ, జనసేన అరాచకత్వానికి బీసీ మహిళ బలి: పద్మ
సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో లబ్ధి పొందిన బీసీ మహిళ గీతాంజలి సంతోషాన్ని చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఏపీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. విచక్షణ మరచిన పచ్చ మూకలు అరాచకంగా ట్రోల్‌ చేయడంతో తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

ఆప్యాయంగా పలకరించేది..
మా ఇంటికి ఎదురుగా నివసించే గీతాంజలి ఎప్పుడూ సంతోషంగా, చలాకీగా ఉంటుంది. ఎక్కడ కనిపించినా మామ్మగారూ... అంటూ చాలా ఆప్యాయంగా పలకరించేది. రెండు రోజులుగా కనిపించకపోతే శివరాత్రి కావడంతో ఎటైనా వెళ్లిందేమో అనుకున్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాధనిపిస్తోంది. 
– అవ్వారు పద్మావతి, ఇస్లాంపేట, తెనాలి 

జీవితంలో మర్చిపోలేనంటూ..  
మేం ఇస్లాంపేటలో సోడాలు విక్రయిస్తాం. గీతాంజలితో కొద్ది రోజుల పరిచయమే అయినా చాలా కలివిడిగా మాట్లాడేది. ఇటీవలే చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ పత్రం తీసుకున్నానని ఎంతో సంతోషంగా చెప్పింది. నా పేరు మీద ఇచ్చారు... జీవితంలో మర్చిపోలేనని చెప్పి మురిసిపోయింది. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తోందని చెబుతుండేది. ఆమె చనిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నా.         
– షేక్‌ రేష్మా, ఇస్లాంపేట, తెనాలి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement