బాలికను బెదిరించి బైక్‌పై ఎక్కించుకెళ్లిన ఇద్దరు యువకులు
నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. అప్పటికే అక్కడ ఉన్న మరో ఇద్దరితో కలిసి లైంగికదాడి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం
పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
కోనేరుసెంటర్(కృష్ణా జిల్లా) : రాష్ట్రంలో బాలికలపై లైంగిక దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా కామాంధులు చెలరేగిపోతున్నారు. తాజాగా మచిలీపట్నంలో శుక్రవారం రాత్రి ఎనిమిదో తరగతి విద్యార్థిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం కాసానిగూడేనికి చెందిన బాలిక సమీపంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.
శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో బాలిక.. బయటకు వెళ్లిన తన తండ్రి వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా రాజుపేటకు చెందిన తలాహ్, అతని స్నేహితుడు కలిసి బాలికను బెదిరించి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో ఇద్దరు యువకులున్నారు. నలుగురు కలిసి బాలికను తీవ్రంగా హింసించి.. లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక వారి నుంచి తప్పించుకుని పెద్దగా కేకలు వేయడంతో నలుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు.
తండ్రి వద్దకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవటంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా.. బాలిక ఏడుస్తూ వారికి ఎదురొచ్చింది. బాలిక తల్లి ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు జిల్లా ఎస్పీ గంగాధరరావు వెల్లడించారు.
మైనర్‌పై పాస్టర్ లైంగిక దాడి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం) : బాలికపై పాస్టర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన బాలికకు తెలంగాణకు చెందిన పాస్టర్ వేముల కిరణ్ వరసకు మేనమామ అవుతాడు. కొండపల్లి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు కిరణ్ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇటీవల కాలంలో బాలిక అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు బాలికను ఆరాతీశారు. బాలిక అసలు విషయం చెప్పడంతో తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో పాస్టర్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు చికిత్స నిమిత్తం బాలికను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాలిక అదృశ్యం
గంగవరం: చిత్తూరు జిల్లా గంగవరం మండలం మల్లేరు గ్రామంలో కూలి పనులకు వెళ్లిన పెద్ద పంజాణి మండలం పెద్దారికుంట గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తండ్రి తెలిపిన వివరాల మేరకు పెద్దపంజాణి మండలం పెద్దారికుంట గ్రామానికి చెందిన బాలిక (16) గతేడాది పదో తరగతితో చదువు నిలిపివేసింది. అప్పటి నుంచి తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లేది.
ఈ క్రమంలో గత గురువారం తల్లితో కలిసి ఇంటినుంచి గంగవరం మండలంలోని మల్లేరు వద్ద కూలి పనులకు వెళ్లింది. అలా పక్కకు వెళ్లొస్తానని తల్లితో చెప్పి వెళ్లిన బాలిక ఎంత సేపటికీ రాలేదు. ఆ విషయాన్ని బాలిక తల్లి తన భర్తతో చెప్పగా మల్లేరు గ్రామంలో విచారించారు.
అయితే ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తమ కుమార్తెను ఎక్కడికో తీసుకెళ్లారని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో తమ కుమార్తె కిడ్నాప్‌నకు గురైందని ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment