
పల్నాడు జిల్లా,సాక్షి: దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ తనను బాగా ఇబ్బంది పెట్టారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి గురజాల కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని పోలీసులు గురువారం గురజాల కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో పాలేటి కృష్ణవేణి అరెస్టుపై విచారణ జరిగింది.
ఈ సందర్భంగా.. ‘దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. నిన్న సాయంత్రం హైదరాబాదులో ఐదు గంటల పది నిమిషాలకు నన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. రాత్రి తినడానికి నాకు ఆహారం కూడా ఏమి పెట్టలేదు. మూడున్నరకి కొంత ఆహారం పెట్టారు. మేం చెప్పినట్టు వినకపోతే సీఐ భాస్కర్ కేసులు పెడతామని బెదిరించారు.
నా భర్త రాజ్ కుమార్‌పైన గంజాయి కేసు పెడతామని సీఐ భాస్కర్ బెదిరించారు. నీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అని సీఐ భాస్కర్ నన్ను వేధించాడు. నీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అని టార్చర్ చేశారు. ఈ పోస్టులు వెనక పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారో చెప్పమని ఇబ్బంది పెట్టారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని బలవంతం చేశారు’ అని అన్నారు. అయితే తాను పెట్టిన పోస్టులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కృష్ణవేణి న్యాయమూర్తికి చెప్పారు.
అనంతరం మిమ్మల్ని పోలీసులు ఎలా చూసుకున్నారని కృష్ణవేణిని న్యాయమూర్తి ప్రశ్నించారు. నన్ను బాగా ఇబ్బంది పెట్టారని కృష్ణమూర్తి చెప్పగా.. పోలీసులు పైన కంప్లైంట్ ఇస్తారా? అని న్యాయమూర్తి కృష్ణవేణిని అడిగారు. అందుకు తాను పోలీసులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా.. కృష్ణవేణి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆమె తరుఫు న్యాయవాది.. న్యాయమూర్తిని కోరారు. వాదన సందర్భంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్ గేట్లకు బేడీలతో తాళాలు వేసిన విజువల్స్ న్యాయమూర్తిగా చూపించారు. అనంతరం, కృష్ణవేణికి 14 రోజులు పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను గుంటూరు కోర్టుకు తరలించారు. కృష్ణవేణి కస్టోడియల్ టార్చర్‌పై దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్‌కు కోర్టు మెమో జారీ చేసింది.