
చిత్తూరు అర్బన్ : తీసుకున్న రూ.10 వేల అప్పుకు వడ్డీల మీద వడ్డీలు కట్టినా.. అవమానకరంగా మాట్లాడినందుకు ఓ మహిళ ఆత్మహత్యే శరణ్యంగా భావించింది. ఏకంగా రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా స్థానికులు, పోలీసులు వచ్చి సకాలంలో ఆమెను రక్షించారు. ఆదివారం చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. నగరంలోని కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన ప్రియాకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈమె భర్త కూలీ పనులు చేస్తుండగా ప్రియా ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఇటీవల ఆమె తన పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టడానికి రాజా అనే వ్యక్తి నుంచి రూ.10 వేలు అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గానూ ప్రతివారం రూ.3 వేలు చొప్పున రెండు నెలలుగా చెల్లించారు. అయితే అది మొత్తం వడ్డీ కింద జమ చేసుకున్నారని, అసలు రూ.10 వేలు ఇచ్చి తీరాల్సిందేనంటూ రాజా అనే వ్యక్తి ఇటీవల బాధితురాలిని బెదిరించాడు. ఫోన్‌లో సైతం ఆమెను అసభ్యంగా తిడుతూ వేధించాడు.
ఈ బాధలు, అవమానం భరించలేని ప్రియా.. ఆదివారం మధ్యాహ్నం మెసానిక్ మైదానం సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అటువైపుగా రైలు వచ్చేందుకు 15 నిముషాలు ఉందనగా, ప్రియాను గుర్తించిన జ్ఞానరాజ్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను బలవంతంగా పట్టాలపై నుంచి పక్కకు లాక్కెళ్లారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలను తెలుసుకుని, కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులకు గురిచేసిన రాజా అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
చిత్తూరు నగరంలో హేమలత (48) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. నగరంలోని టెలిఫోన్ కాలనీకి చెందిన హేమలతకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాత్ రూమ్ కి వెళ్లి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు.