
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అందరినీ ఏ విధంగా మోసం చేస్తారో చెప్పేందుకు గ్రూప్–2(Group-2) పరీక్షల అభ్యర్థుల పరిస్థితే ప్రత్యక్ష నిదర్శనం. మూడు వారాలుగా వారి అభ్యంతరాలు వింటున్నట్లుగా నటించి.. సమస్యను పరిష్కరిస్తానని నమ్మబలికి చివరకు నట్టేట ముంచాడు. విద్యార్థులను లాఠీలతో కొట్టించడమే కాకుండా ఆఖరికి తీవ్ర అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణమని చంద్రబాబు సర్కారు మోసాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) నిప్పులు కురిపించారు.
అధికారం చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు అన్ని వర్గాలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అంశాల వారీగా వివరిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కడిగి పారేశారు. మోసాలకు, అన్యాయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన చందబాబుపై ప్రజలు ఆగ్రహంతో పోరాటాలు చేస్తున్నారని, వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. వైఎస్ జగన్ ట్వీట్‌లో ప్రస్తావించిన అంశాలివీ..
⇒ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు.. అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్‌ృ2 అభ్యర్థులను కూడా నిలువునా మోసం చేశారు.
⇒ మూడు వారాలుగా గ్రూప్‌ృ2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్లు నటించి, వాటిని పరిగణనలోకి తీసుకుని తగిన న్యాయం చేస్తున్నట్లు నమ్మబలికి, చివరకు వారిని నట్టేట ముంచారు. అభ్యర్థుల నుంచి అందిన విజ్ఞాపనలను వింటున్నానని, తప్పకుండా పరిష్కారం చూపిస్తానని పరీక్షలకు రెండు రోజుల ముందు విద్యాశాఖ మంత్రి, మీ కుమారుడు మోసపూరిత ప్రకటన చేశారు. మరోవైపు తాను చెప్పినా సరే, ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చినా సరే పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ముందుకు వెళ్తోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న మీ వాయిస్‌తో ఆడియోను లీక్ చేసి మరో డ్రామా చేశారు. ఇంకోవైపు ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులతో లాఠీఛార్జీ చేయించి అమానుషంగా ప్రవర్తించారు. మీరు ప్రజలను ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే. ఆఖరికి అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణం.
⇒ మా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి.. మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం ఒక మోసమే.
⇒ ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసలు దాని గురించి పట్టించుకోకపోవడం కూడా మీరు చేసిన మోసమే.
⇒ వలంటీర్లకు రూ.పది వేలు ఇస్తానని చెప్పి.. జీతం సంగతి దేవుడెరుగు చివరకు 2.6 లక్షల మంది ఉద్యోగాలను ఊడగొట్టడమూ మోసమే.
⇒ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కుదింపు పేరిట వారిని వేరే డిపార్ట్‌మెంట్లకు సర్దుబాటు చేసి అక్కడ ఖాళీలకు శాశ్వతంగా కోత పెట్టడమూ మోసమే.
⇒ నిరుద్యోగ భృతి అని, నెల నెలా రూ.3,000 అని, ప్రతి ఇంటినీ మోసం చేయడం ఇంకో మోసం.
⇒ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో 18 వేల మందిని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లనూ, ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లోనూ, ఏపీ ఎండీసీలోనూ, వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారిని తొలగించి వారి జీవితాలను నడిరోడ్డుపై నిలబెట్టడం కూడా మీరు చేస్తున్న మోసాల్లో భాగమే.
⇒ అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్న మీ హామీపై ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఉద్యోగులకు చేస్తున్న మోసమే.
⇒ ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అంటూ ఉన్న పీఆర్‌సీ ఛైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించి, కొత్త పీఆర్‌సీ ఇంతవరకూ వేయకపోవడమూ ఇంకో మోసమే.

⇒ ఒకటో తేదీనే జీతాలు అంటూ ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చి, ఆ తర్వాత ప్రతి నెలా ఉద్యోగులు ఎదురు చూసేలా చేయడం కూడా మీరు చేసిన మోసాల్లో భాగమే.
⇒ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 3 డీఏలు పెండింగ్‌లో పెట్టడం కూడా ఒక అన్యాయమే.
⇒ ట్రావెల్ అలవెన్స్‌లు, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్.. అన్నీ పెండింగ్‌లో పెట్టడం కూడా ఇంకో అన్యాయమే.
⇒ ఉద్యోగస్తులకు సంబంధించి వారి జీఎల్‌ఐ, జీపీఎఫ్ కూడా మీ అవసరాలకు వాడేసుకుని ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టించడం కూడా మీరు చేస్తున్న అన్యాయాల్లో భాగమే.
⇒ మోసాలు, అన్యాయాలకు కేరాఫ్‌గా మారిన చంద్రబాబూ.. మీ వైఖరిపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో పోరాటాలు చేస్తున్నారు. ప్రజా పోరాటాలకు మా పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుంది.
1. @ncbn గారూ… నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు అన్నివర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్-2 అభ్యర్థులనుకూడా నిలువునా మోసం చేశారు.
2. మూడు వారాలుగా గ్రూప్-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి, వాటిని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 23, 2025