
వ్యవస్థాగతంగా మరింత బలోపేతం అవుదాం
పార్టీ బీసీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో వక్తలు
కూటమి పార్టీలకు బీసీల సత్తా చూపిద్దామని పిలుపు
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ బీసీ విభాగం నేతలు కొనియాడారు. పార్టీ నేతలెవరైనా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా వైఎస్ జగన్ పాలించారని చెప్పారు. సామాజిక న్యాయం విషయంలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వ్యవస్థాగతంగా మరింత బలోపేతం అవుదామని చెప్పారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. బీసీలు ఎవరికీ భయపడనవసరం లేదన్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదని.. బ్యాక్ బోన్ క్లాసెస్ అని మన నాయకుడు జగన్ నిర్వచించారన్నారు. కూటమి పాలనలో అరాచకాలు అణగారిన వర్గాలపైనే ఎక్కువగా జరిగాయని చెప్పారు. అనంతపురం జిల్లాలో బీసీ నేత కురుబ లింగమయ్యను దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో బీసీ కులాలు ఆత్మగౌరవంతో జీవించాయన్నారు.
అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందుకుని, రాజ్యాధికారాన్ని అనుభవించాయని గుర్తు చేశారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచగొల్ల రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ పాలన బీసీలకు స్వర్ణయుగం అని కొనియాడారు. బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ మాట్లాడుతూ.. కూటమి పార్టీలకు బీసీల సత్తా చూపిద్దాం అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పూలే ఆశయాలను జగనన్న కొనసాగించారని చెప్పారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి సూపర్ సిక్స్ మోసాలను బయటపెడతామని చెప్పారు.
కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం
సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతాయని, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించింది ఒక్క వైఎస్సార్‌సీపీనే అని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమం విషయంలో వైఎస్ జగన్ చెప్పనివి కూడా చేసి ఆ తర్వాత ప్రజల వద్దకు వెళ్లారని గుర్తు చేశారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయమని, అధికారంలోకి రాగానే దోచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు.
కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళదామని చెప్పారు. వ్యవస్థాగతంగా మరింత బలోపేతం అవుదామని, గతంలో కంటే మెరుగ్గా పూర్తి స్థాయి కమిటీలు నియమించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.