
కందుల కొనుగోలు గడువు పెంపు
రాయచోటి జగదాంబసెంటర్: నాఫెడ్ వారి ఆధ్వర్యంలో ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లాలో కంది పండించిన, ఈ క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి మద్దతు ధరపై ఒక క్వింటా రూ.7,550 కందులు కొనుగోలు చేసేందుకు గడువును ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ త్యాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు గడువు గతంలో ఈ నెల 15 వరకు ఉందని, ప్రస్తుతం 19వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఆయన కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులు రూ.150 దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశాలు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వన్నుట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు డీఈఓ కార్యాలయంలో కానీ సంబంధింత మండల విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
విజయానికి అవగాహనే అస్త్రం
కురబలకోట: ఏ రంగంలో నైనా విజయానికి అవగాహన అస్త్రం లాంటిదని, విద్యార్థులు ఉద్యోగం సాధించాలంటే లర్న్, అడాప్ట్, స్కిల్ చేంజింగ్ ఎబిలిటీ అనే మూడు క్వాలీటీలు ఆవశ్యకమని బెంగళూరు మైక్రోసాఫ్ట్ అజురే ఏఐ ఎంవీపీ ఎస్. పూర్ణిమ అన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువు తర్వాత మంచి ఉద్యోగం సాధించాలని కలలు కంటారన్నారు. ఇందుకు తాజా టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఇందుకు మైక్రోసాఫ్ట్ స్టూడెంట్స్ క్లబ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ నైపుణ్యాలు, గ్లోబల్ టెక్నాలజీ ట్రెండ్స్‌పై అవగాహన పెంచుకోవచ్చన్నారు. ప్రాజెక్టులు, హ్యాక్‌ధాన్ ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని పొందడంతో పాటు నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు.

కందుల కొనుగోలు గడువు పెంపు