
రైతులను ఆదుకోకుంటే పోరుబాట
మార్టూరు: అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలైనా కల్పించి ఆదుకోవాలని, లేకుంటే పోరుబాట తప్పదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. మార్టూరు మండల కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో బుధవారం మార్టూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం పొగాకు, మిర్చి, శెనగ, వరి తదితర రైతులు గిట్టుబాటు ధరలు లభించక వీధిన పడే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. మిర్చి, పొగాకు రైతులకు పెట్టుబడి వ్యయం ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల అవుతోందని గుర్తుచేశారు. వాటిని కొనుగోలు చేసే నాథుడే కరవయ్యాడని ఆయన విమర్శించారు. రైతాంగాన్ని మభ్యపెట్టడం కోసం సీఎం చంద్రబాబు గిట్టుబాటు ధరల కోసం కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపించారు. పంటలను ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయదని ఆయన ప్రశ్నించారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వమే పంట బీమా చేయించి ఆదుకోవాల్సిందిపోయి బీమా రుసుము భారం రైతులపై వేసి చోద్యం చూస్తోందని ఆయన విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోగానీ, ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలోగానీ పండుగలా వ్యవసాయం సాగిందన్నారు. సాగంటే నేడు దండగలా మారటానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన అన్నారు. అమరావతి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ ఆరుగాలం కష్టపడే రైతులపై, వ్యవసాయంపై లేకపోవడం దారుణమని నాగార్జున మండిపడ్డారు.
అకాల వర్షంలో దీనావస్థలో రైతులు
మంగళవారం రాత్రి మార్టూరు మండలంలో కురిసిన అకాల భారీ వర్షానికి మొక్కజొన్న, పొగాకు, మిర్చి పంటలను కల్లాల్లో ఆరబెట్టుకున్న రైతుల బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళికి ఫోన్ ద్వారా మార్టూరు పరిసర ప్రాంతాల రైతుల సమస్యలను నాగార్జున వివరించారు. రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. అధికారులను బాధిత రైతుల వద్దకు పంపి పంట నష్టం తెలుసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులను ఆదుకుంటామని తెలిపారు.
పార్టీని బలోపేతం చేయండి
తనను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నాగార్జున మాట్లాడుతూ... పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మధుసూదన్ రెడ్డితో కలిసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, నాయకులు ఉప్పలపాటి అనిల్, గర్నె పూడి రవి చందు, అడకా గంగయ్య, తమ్ములూరి సురేష్, మైల నాగేశ్వరరావు, అట్లూరి సుకుందరావు, వంకాయలపాటి భాగ్యారావు, గడ్డం మస్తాన్ వలి, దివ్వె కిషోర్, సులేమాన్ ఖాదర్ బాషా, కొండ మస్తాన్, కొమెర శ్రీను, రావిళ్ళ అంజిబాబు, మోషే నాయక్, బాజీ నాయక్, కోటి, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
‘సూపర్ సిక్స్’ అమలు లేదు..
గిట్టుబాటు ధరలైనా కల్పించండి
అకాల వర్షానికి దెబ్బతిన్న
పంటలను ప్రభుత్వమే కొనుగోలు
చేయాలి
వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా
అధ్యక్షుడు మేరుగ నాగార్జున
జిల్లా కలెక్టర్ దృష్టికి అన్నదాతల
సమస్యలు