
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
సుజాతనగర్ : భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సుజాతనగర్ రైతు వేదికలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని, భూ వివాదాలకు తావు లేకుండా రైతులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా నూతన ఆర్‌ఓఆర్ తెచ్చిందని తెలిపారు. రైతులు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వివరించారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రేఖాంశాలు, అక్షాంశాల ఆధారంగా హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యల పరిష్కారం అనంతరం పూర్తి స్థాయి రికార్డులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. భూ భారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఏ అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి..అది పరిష్కారం కాకుంటే ఎవరికి అప్పీల్ చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, తహసీల్దార్ శిరీష, పీఏసీఎస్ చైర్మన్ మండే హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను సమర్థంగా అమలుచేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పరిశీలన వేగవంతం చేయాలని, జాబితాలో పేరు లేని నిరుపేదలుంటే వారి పేర్లు కూడా జతచేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను త్వరగా పరిశీ లించి అర్హుల జాబితా రూపొందించాలన్నారు. రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని రేషన్‌కార్డు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పెపులైన్ల లీకేజీ, పంపుల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. తాగునీటి సమస్య ఉంటే ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచించారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్