
భూ భారతి.. రైతులకు శ్రీరామ రక్ష
అశ్వారావుపేట: గత ప్రభుత్వ హయాంలో ధరణి ద్వారా రైతులకు వచ్చిన కష్టాలకు చెక్ పెట్టేందుకే భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.37.5 కోట్లతో నిర్మించనున్న 100 పడకల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. ఈ చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని, ధరణిలా ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని రూపొందించిన చట్టం కాదని చెప్పారు. ఇది రైతులకు శ్రీరామ రక్ష అని అన్నారు. తొలుత రాష్ట్రంలో నాలుగు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జూన్ 2 కల్లా ఆయా గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని, ఆ అనుభవంతో మిగిలిన చోట్ల కూడా అమలు చేస్తామని వివరించారు. ఆగస్టు 15 నాటికి చట్టాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. సమస్యను బట్టి తహసీల్దార్ నుంచి సీసీఎల్‌ఏ వరకు వెళ్లేలా డిజైన్ చేశామని తెలిపారు. సీసీఎల్‌ఏ వద్ద న్యాయం జరగకుంటే ట్రబ్యునల్‌ను ఆశ్రయించవచ్చన్నారు. ధరణి చట్టంలో 9.26 లక్షల రైతుల సమస్యలకు పరిష్కారం చూపకపోగా.. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు కాగానే 5.45లక్షల దరఖాస్తులను పరిష్కరించామన్నారు. రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన, గిరిజనేతర రైతుల మధ్య సున్నిత సమస్యలు ఉన్నాయని, వీటి పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యలను భూ భారతి చట్టంతో పరిష్కరించుకోవచ్చన్నారు. అశ్వారావుపేటలో 911, 512 సర్వే నంబర్ల సమస్యను ఇదే వేదికపై గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ప్రస్తావించామని అన్నారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. భూభారతి ద్వారా రైతులకు నమ్మకం, ధైర్యం, రక్షణ కల్పిస్తామని చెప్పారు. పాస్‌బుక్ కావాలంటే మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, భూ భారతి పోర్టల్‌లో రూ.300 చెల్లిస్తే పాస్‌బుక్ పొందవచ్చని తెలిపారు. సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ వనం కృష్ణప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి పొంగులేటి హాజరైన ఈ కార్యక్రమానికి.. ప్రొటోకాల్ పాటించడంలో అధికారులు, రక్షణ బాధ్యతల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వినిపించాయి. ఏ పదవీ లేకున్నా పలువురు కాంగ్రెస్ నాయకులు పోటీపడి వేదికపైకి రావడం విస్మయానికి గురిచేసింది. చోటా మోటా నాయకులను అడ్డుకోని పోలీసులు సాధారణ ప్రజలను మాత్రం లోనికి అనుమతించకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు. ఈ విషయమై తహసీల్దార్ కృష్ణప్రసాద్‌ను అడగగా.. ‘మేం ఎవరినీ పిలవలేదు.. ప్రొటోకాల్ అంటూ లేకుండా ఎవరు పడితే వాళ్లు వచ్చేశారు’ అన్నారు.
ఈ చట్టం నాలుగు గోడల మధ్య తెచ్చింది కాదు
ఇప్పటికే 5.65 లక్షల దరఖాస్తుల పరిష్కారం
గిరిజన ప్రాంత సమస్యలకు ప్రత్యేక కమిటీ
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి