
ఉపాధి పథకాలకే దరఖాస్తులు ఇవ్వండి
గిరిజన దర్బాదర్‌లో పీఓ రాహుల్
భద్రాచలం : భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి పథకాలు, జీవనోపాధి తదితర సమస్యలపై మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని, ఉద్యోగాల కోసం ఎవరూ ఇవ్వొద్దని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించి, అర్హతల మేరకు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ అవుతాయని, వాటి కోసం దర్బార్‌లో దరఖాస్తులు ఇవ్వొద్దని కోరారు. గిరిజన యువత, మహిళలకు స్వయం ఉపాఽధి పథకాలు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆర్చరీ విజేతలకు అభినందన..
వైజాగ్‌లోని గీతం యూనివర్సిటీలో ఇటీవల జరిగిన గిరిజన ఆర్చరీ క్రీడల్లో విజేతలతో పాటు కోచ్‌లు, ప్రోత్సహించిన అధ్యాపకులను పీఓ తన చాంబర్‌లో అభినందించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఎస్‌డీసీ రవీంద్రనాథ్, గిరిజన సంక్షేమ ఈఈ చంద్రశేఖర్, గురుకుల ఆర్‌సీఓ నాగార్జున రావు, ఏఓ సున్నం రాంబాబు, క్రీడాధికారి గోపాలరావు, వెంకటనారాయణ, నాగ శ్యామ్, వెంకటేశ్వర్లు, మారెప్ప పాల్గొన్నారు.
నిష్పక్షపాతంగా లబ్ధిదారులను
ఎంపిక చేయండి..
రాజీవ్ యువ వికాస పథక లబ్ధిదారులను నిష్పక్షపాతంగా ఎంపిక చేయాలని పీఓ రాహుల్ అన్నారు. ఆర్‌వైవీ దరఖాస్తులపై ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. గిరిజన నిరుద్యోగ యువత సమర్పించిన దరఖాస్తులను మండల్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీతో పరిశీలించాలన్నారు. హాస్టళ్లు, పాఠశాలల్లో మరమ్మతుల ప్రతిపాదనలను తక్షణమే అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో సాంఘిక, బీసీ సంక్షేమాధికారులు అనసూయ, ఇందిర, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓలు అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.