
గడిచిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ త్వరలో ఆన్‌లైన్ ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో రిటర్న్స్ ఎప్పుడు దాఖలు చేయాలి, గడువు ఎప్పుడు, రిఫండ్‌ను ఎప్పుడు పొందే అవకాశం ఉందనే అంశాల గురించి తెలుసుకుంది.
ఐటీఆర్‌ను ఎప్పుడు ఫైల్ చేయవచ్చు?
ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 2025-26 మదింపు సంవత్సరానికి మీ ఐటీఆర్‌ను సమర్పించవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ధ్రువీకరణ తేదీని అధికార వర్గాలు వెల్లడించలేదు. అయినప్పటికీ ఆదాయ పన్ను శాఖ సాధారణంగా ఏటా ఏప్రిల్ నాటికి ఐటీఆర్ ఫారాలను అందుబాటులో ఉంచుతుంది. ఫారాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రిటర్నులను ఈ-ఫైలింగ్ చేయడం ప్రారంభించవచ్చు.
ఐటీఆర్ నమోదు చేయడానికి చివరి తేదీ ఏమిటి?
గత ఏడాది షెడ్యూల్ ప్రకారం జరిమానా లేకుండా రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31, 2024గా నిర్ణయించారు. జరిమానాలతో ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు అనుమతించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన రాలేదు.
రిఫండ్‌లు ఎప్పుడు పొందవచ్చు?
రిఫండ్ ప్రక్రియను ఆదాయపు పన్ను శాఖ మరింత సులభతరం చేసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్ దాఖలు చేసిన వారం నుంచి 20 రోజుల్లో వారి రిఫండ్లను పొందేందుకు వీలు కల్పిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్నుల్లో ఎలాంటి దోషాలు ఉండకూడదు. ఫైలింగ్ సమయంలో ఆధార్ ఓటీపీతో ధ్రువీకరించాలి. బ్యాంక్ ఖాతాను ముందుగా నమోదు చేసి పాన్‌తో లింక్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!
కీలక డాక్యుమెంట్లు ఏమిటి?
మీ రిటర్న్‌ను సజావుగా, వేగంగా దాఖలు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సేకరించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీరు పని చేస్తున్న యజమాని నుంచి ఫారం 16, వేతన స్లిప్పులు, మీ బ్యాంకు నుంచి ధ్రువీకరణ పత్రాలు, ఏదైనా మూలధన లాభాల వివరాలు ఉంటే వాటిని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఆదాయం పొందినట్లయితే దానికి రుజువులను కూడా జత చేయాల్సి ఉంటుంది.