
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) తాజాగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ (ఎన్పీసీఐఎల్) నుంచి భారీ ఆర్డరు దక్కించుకుంది. దీని విలువ రూ. 12,800 కోట్లని కంపెనీ వెల్లడించింది. ఎన్పీసీఐఎల్ చరిత్రలోనే ఈ అతి పెద్ద కాంట్రాక్టుని బీహెచ్ఈఎల్, ఎల్అండ్టీలాంటి దిగ్గజాలతో పోటీపడి దక్కించుకున్నట్లు తెలిపింది.
దీని కింద కర్ణాటకలోని కైగా వద్ద ఒక్కోటి 700 మెగావాట్ల సామర్థ్యం గల రెండు న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ కాంట్రాక్టుతో అణు ఇంధన రంగంలోకి ప్రవేశించినట్లయిందని కంపెనీ పేర్కొంది. అత్యున్నత ప్రమాణాలు, భద్రత, విశ్వసనీయతకు కట్టుబడి ఉంటూ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని ఎంఈఐఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సీహెచ్ సుబ్బయ్య ధీమా వ్యక్తం చేశారు.