
ఈసారి 6.5 శాతంగా ఈవై అంచనాలు
ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుదల, వినియోగ వృద్ధి సానుకూలాంశాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నప్పటికీ తగ్గిన క్రూడాయిల్ రేట్లతో దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు నెమ్మదించడం, దేశీయంగా వినియోగం పెరగడం లాంటి దేశ వృద్ధికి సానుకూలంగా దోహదపడనున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఒక నివేదికలో పేర్కొంది.
ఎగుమతుల క్షీణత, గ్లోబల్ మందగమనం, ముడిచమురు ధరల తగ్గుదల, అంతర్జాతీయంగా ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగిపోవడం వంటి అంశాలు భారత వృద్ధిపై ప్రభావం చూపనున్నాయని వివరించింది. సముచిత ఆర్థిక, ద్రవ్య విధానాలతో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపునకు కట్టడి చేస్తూ, 2026 ఆర్థిక సంవత్సరంలోను, అలాగే మధ్యకాలికంగాను భారత్ 6.5 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ చెప్పారు.
‘అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 60–65 డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని, ఇది భారత్‌కు సానుకూలంగా పరిణమించగలదని అంచనా వేస్తున్నాం‘ అని వివరించారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేసిన 6.2–6.7 శాతం వృద్ధి రేటు శ్రేణిలోనే ఈవై అంచనాలు ఉండటం గమనార్హం. టారిఫ్‌ల యుద్ధం, అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్చితి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధిరేటు 6.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్, 6.3 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నాయి. ఇక ఆర్‌బీఐ, ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ 6.5 శాతంగా ఉంటుందని, ఓఈసీడీ, ఫిచ్ రేటింగ్స్ 6.4 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేశాయి.
నివేదికలో మరిన్ని విశేషాలు..
→ అధిక టారిఫ్‌లు, అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ కారణంగా ఎగుమతులు నెమ్మదించవచ్చు. అయితే, స్థూల దేశీయోత్పత్తిపై ప్రభావం ఒక మోస్తరుగానే ఉండొచ్చు.
→ గ్లోబల్ మందగమనంతో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి నెమ్మదించినా, పటిష్టమైన ఆర్థిక, ద్రవ్య విధానాల వల్ల భారత్ కాస్త మెరుగైన స్థితిలో ఉండొచ్చు.
→ ప్రధాన ఎగుమతి దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాలు పెరగడం వల్ల డంపింగ్ రిస్కులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారత్ యాంటీ–డంపింగ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
→ గ్లోబల్ అవాంతరాలపై భారత్ వ్యూహాత్మకంగా స్పందించాల్సి ఉంటుంది. వృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక విధానాలు, ఉదార ద్రవ్య విధానాల ద్వారా భారత్ ఈ పరిస్థితుల నుంచి పటిష్టంగా బైటపడొచ్చు.
→ స్వల్పకాలికంగా అమెరికా నుంచి కొంత క్రూడాయిల్ దిగుమతులను పెంచుకోవడం ద్వారా ఆ దేశంతో వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడంతో పాటు ప్రతీకార టారిఫ్ రేట్లను కూడా తగ్గిస్తే భారత్‌కు శ్రేయస్కరంగా ఉంటుంది.
→ 2025 సెపె్టంబర్–అక్టోబర్ నాటికి సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే అమెరికాతో వాణిజ్యంలో కాస్త స్థిరత్వం వస్తుంది.
→ స్వల్పకాలికం నుంచి దీర్ఘకాలిక దృష్టికోణంలో చూస్తే భూ, కార్మిక చట్టాల్లో సంస్కరణలు వేగవంతం చేయాలి. విద్య, ఏఐ.. జెన్‌ఏఐలాంటి కొత్త నైపుణ్యాల్లో శిక్షణపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల స్కీము పరిధిని విస్తరించాలి.