
సోలార్ ప్యానెల్, ఎలక్ట్రానిక్స్ తయారీదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం భారతదేశపు వెండి దిగుమతులు దాదాపు రెండింతలకు చేరుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే బంగారం కంటే వెండికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.
బంగారం, వెండి వినియోగంలో భారత్ ప్రధానంగా చెప్పుకోదగ్గ దేశం. భారత్ గతేడాది 3,625 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం వెండి దిగుమతి 6500 నుంచి 7000 టన్నుల వరకు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2024 ప్రథమార్థంలోనే భారతదేశపు వెండి దిగుమతులు 560 టన్నుల నుంచి 4,554 టన్నులకు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ దిగుమతులు పెరగటానికి మరో కారణం ట్యాక్స్ తగ్గించడం కూడా. స్మగ్లింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంని ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించడం జరిగింది.
భారత్ ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, చైనా నుంచి వెండిని దిగుమతి చేసుకుంటుంది. ఈ రోజు దేశీయ మార్కెట్లో రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 91700 రూపాయలకు చేరింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేజీ వెండి ధర త్వరలోనే రూ. 1 లక్షకు చేరుకునే అవకాశం ఉంది.