
స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీలు వరుసగా 2024-25 చివరి త్రైమాసిక ఫలితాలు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజాలుగా ఉన్న విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు వాటి పనితీరు నివేదికలను ప్రకటించాయి. అయితే ఇవి ఇన్వెస్టర్లు ఆశించిన రీతిలో లేకపోవడంతో నిరాసక్తత నెలకొంటుంది. ఒకప్పుడు స్థిరత్వానికి, వృద్ధికి దిక్సూచిగా నిలిచిన ఐటీ రంగం ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. టెక్ కంపెనీల లాభాలు నేలచూపులు చూస్తుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి
ట్రంప్ సుంకాలు ప్రధానంగా భారత టెక్ కంపెనీలకు అవాంతరంగా తోస్తున్నాయి. ఎందుకంటే భారత్‌లోని టెక్నాలజీ సర్వీసులను యూఎస్‌లోకి ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలో యూఎస్ దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధిస్తుండడంతో ఈ రంగం కుదేలవుతుందని భావిస్తున్నారు. దాంతోపాటు ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. భారత ఐటీ సేవలకు కీలక మార్కెట్ అయిన అమెరికా ద్రవ్యోల్బణం, విధాన మార్పులతో సతమతమవుతుండటంతో ఔట్ సోర్సింగ్ టెక్ సేవలపై ఖర్చు తగ్గింది.
బలహీనమైన ఆదాయ అంచనాలు
ప్రధాన ఐటీ కంపెనీలు ఊహించిన దానికంటే బలహీనమైన రాబడులను నమోదు చేస్తున్నాయి. ఉదాహరణకు, విప్రో భవిష్యత్తులో రెవెన్యూ క్షీణిస్తుందని ముందుగానే అంచనా వేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా వృద్ధిని కొనసాగించడానికి కష్టపడుతున్నాయి.
ఐటీ సేవలకు తగ్గుతున్న డిమాండ్
చాలా కంపెనీలు తమ బడ్జెట్లను కఠినతరం చేస్తున్నాయి. దాంతో అవసరమైన ఐటీ సేవల కోసం వ్యయాలు(డిసిక్రీషినరీ స్పెండింగ్) తగ్గాయి. కంపెనీలు కొత్త టెక్నాలజీ పెట్టుబడుల కంటే వ్యయ తగ్గింపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు కాంట్రాక్టులు తగ్గేందుకు దారితీస్తోంది.
స్టాక్ మార్కెట్ అస్థిరత
వివిధ రేటింగ్ ఏజెన్సీలు భవిష్యత్తు వృద్ధి అంచనాలను తగ్గిస్తుండడంతో ఇన్వెస్టర్ల ఆందోళనల కారణంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పతనమవుతుంది. గత కొన్ని నెలలుగా ఇండెక్స్ భారీగా పడిపోయింది. ఇది గ్లోబల్ టెక్ సెంటిమెంట్‌ను అద్దం పడుతుంది. ఇది ఐటీ రంగంపై మరింత విశ్వాసాన్ని దెబ్బతీసింది.
ఇదీ చదవండి: త్వరలో ఆర్థిక మాంద్యం!
భౌగోళిక, వాణిజ్య సవాళ్లు
ముఖ్యంగా అమెరికాలో కొత్త వాణిజ్య విధానాలు, టారిఫ్ నిబంధనలు ఐటీ కంపెనీల కష్టాలను మరింత పెంచాయి. ఈ మార్పులు నిర్వహణ వ్యయాలను అధికం చేస్తున్నాయి. భవిష్యత్తు ఒప్పందాలపై అనిశ్చితి సృష్టించాయి.