
ఎడాపెడా అప్పులు చేసే ధోరణిని కట్టడి చేసే కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తోంది. దేశ రుణ వితరణ వ్యవస్థను మార్చే ఈ నియమం మూడు కంటే ఎక్కువ రుణదాతల (బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు) నుండి రుణాలు తీసుకోకుండా రుణగ్రహీతలను కట్టడి చేస్తుంది. అధిక వినియోగాన్ని అరికట్టడం, బాధ్యతాయుతమైన రుణాలను ప్రోత్సహించడమే ఈ నిబంధన లక్ష్యం.
ఎందుకీ నిబంధన?
మైక్రోఫైనాన్స్ రంగం అణగారిన వర్గాల సాధికారతలో కీలక పాత్ర పోషించినప్పటికీ, రుణగ్రహీతలు బహుళ వనరుల నుండి రుణాలు పొందడం చూసింది. ఇది నిర్వహణకు సాధ్యంకాని రుణానికి దారితీస్తుంది. ఈ మితిమీరిన వినియోగం, కొన్ని సంస్థల దూకుడు రుణ విధానాలు వ్యవస్థలో బలహీనతలను సృష్టించాయి. రుణగ్రహీతలను మూడు రుణదాతలకు పరిమితం చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించాలని, డిఫాల్టర్ల ప్రమాదాన్ని తగ్గించాలని భావిస్తున్నారు.
రుణగ్రహీతలపై తక్షణ ప్రభావం
ప్రస్తుతం మూడు కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకుంటున్న 45 లక్షల మంది రుణగ్రహీతలకు, ఈ నియమం సవాలుగా మారుతుంది. వీరు తరచుగా వర్కింగ్ క్యాపిటల్, అత్యవసర అవసరాలు లేదా రోజువారీ మనుగడ కోసం అతివ్యాప్త రుణాలపై ఆధారపడతారు. మూడు బ్యాంకుల పరిమితితో, రుణగ్రహీతలు లిక్విడిటీ కొరతను ఎదుర్కోవచ్చు.
ఇది వారి ఆర్థిక వ్యూహాలను పునఃసమీక్షించుకునేలా, ఖర్చులను తగ్గించుకునేలా చేస్తుంది. అంతేకాదు క్రెడిట్ మదింపులు కఠినంగా మారతాయి. ముఖ్యంగా అధిక-రిస్క్ గా భావించే రుణగ్రహీతలకు రుణ తిరస్కరణలు పెరగవచ్చు. ఇది కొంతమందిని అధిక వడ్డీలు ఉండే అనధికారిక రుణ మార్గాలవైపు నెట్టవచ్చు.
రుణదాతలకూ సవాళ్లు..
కొత్త రూల్ రుణదాతలకూ అనేక సవాళ్లను కలిగిస్తుంది. మైక్రోఫైనాన్స్ సంస్థలు తమ పోర్ట్ఫోలియో వ్యూహాలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో స్వల్పకాలంలో వారి కస్టమర్ బేస్ ఎంతో కొంత కోల్పోయే అవకాశం ఉంది.
అంతేకాక, సంస్థలు రుణ వితరణ విషయంలో మరింత క్షణ్ణమైన ప్రక్రియలను పెంపొందించుకోవాలి. రుణగ్రహీతలు మూడు-రుణదాతల పరిమితిని మించకుండా చూసుకోవాలి. ఇందుకోసం బలమైన వ్యవస్థలు, సమన్వయం అవసరమవుతాయి.
వాస్తవానికి ఈ నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, సజావుగా జరిగేందుకు ఏప్రిల్ 1కి వాయిదా పడింది. ఈ జాప్యం వాటాదారులకు సన్నద్ధం కావడానికి సమయం అందించినప్పటికీ, రుణగ్రహీతలు, రుణదాతలు ఈ ముఖ్యమైన మార్పుకు ఎలా అలవాటు పడతారనేదే అసలైన పరీక్ష.