
రతన్ టాటా మూగజీవాలపై ఎంత ప్రేమ చూపించేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన చివరి శ్వాస వరకూ తన పెంపుడు జంతువుల సంరక్షణకు శ్రద్ధ చూపిన రతన్ టాటా తన మరణం తర్వాత కూడా వాటి సంరక్షణకు లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. రతన్ టాటా రాసిన రూ.10,000 కోట్ల వీలునామాలో తన పెంపుడు జర్మన్ షెపర్డ్ శునకం ‘టిటో’ను చేర్చారు. ఈ శునకానికి "అపరిమిత" సంరక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. ఐదారేళ్ల క్రితం ఇదే పేరుతో ఇంతకు ముందున్న శునకం చనిపోయిన తర్వాత ఇప్పుడున్న ‘టిటో’ను ఆయన తెచ్చుకుని సంరక్షణ బాధ్యతలు చూసేవారు.
రతన్ టాటా దగ్గర చాలా ఏళ్లుగా వంటమనిషిగా పని చేస్తున్న రాజన్ షా ఇకపై ‘టిటో’ సంరక్షణ బాధ్యతలు చూసుకుంటారు. నివేదిక ప్రకారం.. టాటాతో మూడు దశాబ్ధాలుగా ఉంటున్న పనిమనిషి సుబ్బయ్యకు సంబంధించిన నిబంధనలను కూడా వీలునామాలో చేర్చారు.
రూ. 10,000 కోట్లకు పైగా ఉన్న రతన్ టాటా ఆస్తులలో అలీబాగ్‌లోని 2,000 చదరపు అడుగుల బీచ్ బంగ్లా, ముంబైలోని జుహు తారా రోడ్‌లోని 2-అంతస్తుల ఇల్లు, రూ. 350 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టాటా సన్స్‌లో 0.83% వాటా ఉన్నాయి. దీన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF)కి బదిలీ చేయనున్నారు.
