
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో వ్యూహాత్మక మార్పులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రాబోయే రోజుల్లో మరింత వడ్డీరేట్ల కోతలను అమలు చేయాలని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. దాంతో రాబోయే రోజుల్లో మరిన్ని వడ్డీరేట్ల కోతలుండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
2025 ఫిబ్రవరి 7న ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేస్తూ 6.25 శాతానికి తగ్గించింది. దాదాపు ఐదేళ్లలో ఎంపీసీ తొలిసారి ఈ నిర్ణయం తీసుకుంది. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. వినియోగం, పెట్టుబడుల మందగమనంతో భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. రుణ వ్యయాన్ని తగ్గించడం ద్వారా, ఖర్చులు, పెట్టుబడులను ఉత్తేజపరిచేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది. ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ క్రమంగా తగ్గుతుందని, ఆర్‌బీఐ లక్ష్యానికి అనుగుణంగా ఉందని ఎంపీసీ భావిస్తోంది.
ఇదీ చదవండి: ఫిబ్రవరిలో సవరించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు..
అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం కూడా ఆర్‌బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు పలు కేంద్ర బ్యాంకులు అనుకూలమైన ద్రవ్య విధానాలను అవలంబిస్తున్నాయి. ఆర్‌బీఐ కూడా అదేబాటలో నడవాలని భావిస్తోంది. రెపో రేటు తగ్గింపు వల్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు వినియోగదారులకు చౌకగా లభిస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఇది వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.