
ఏప్రిల్‌లో 64,013 యూనిట్లకు పరిమితం
మార్చితో పోలిస్తే 50% పైగా క్షీణత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్ నెలలో నిరాశపరిచాయి. దేశవ్యాప్తంగా మార్చి నెలలో 1,37,146 యూనిట్లు రోడ్డెక్కితే.. గత నెలలో ఈ సంఖ్య సగానికంటే క్షీణించి 64,013 యూనిట్లకు పరిమితమైంది. సబ్సిడీ మొత్తం తగ్గడం, కొన్ని ప్రముఖ మోడళ్ల ధర పెరగడం ఈ క్షీణతకు కారణం.
ఎన్నికల సీజన్ కావడం కూడా ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2023 ఏప్రిల్‌లో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన ఈ–టూవీలర్ల సంఖ్య 66,873 యూనిట్లు. 2024 జనవరి, ఫిబ్రవరిలో ప్రతినెలా 82 వేల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఫేమ్–2 సబ్సిడీ అందుకోవడానికి మార్చి నెల చివరిది కావడం కూడా 1,37,146 యూనిట్ల గరిష్ట అమ్మకాలకు దోహదం చేసింది.
కంపెనీలు మోడల్‌నుబట్టి రూ.4,000లతో మొదలుకుని రూ.16,000 వరకు ధరలను పెంచడం గమనార్హం. అయితే నూతన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.10,000, ఈ–రిక్షా, ఈ–కార్ట్‌కు రూ.25,000, ఈ–ఆటోకు రూ.50,000 సబ్సిడీ ఆఫర్ చేస్తారు. ఇక ఏప్రిల్‌లో ఈ–టూ వీలర్ల విక్రయాల్లో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కో, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాప్‌లో నిలిచాయి.
ఇవి చదవండి: అధిక రాబడులకు మూమెంటమ్ ఇన్వెస్టింగ్..