
అమెరికా టారిఫ్‌లు వాహన ధరలను పెంచుతాయని నిస్సాన్ అమెరికా ఛైర్మన్ క్రిస్టియన్ మ్యూనియర్ ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాల వల్ల మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు కారు కొనలేని పరిస్థితులు నెలకొంటున్నట్లు తెలిపారు. మెక్సికో నుంచి ఎగుమతయ్యే వాహనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు ఆటోమొబైల్ కంపెనీలను కుదిపేస్తాయని చెప్పారు.
‘20,000 డాలర్ల(రూ.16 లక్షలు) సగటు ధర కలిగిన నిస్సాన్ వెర్సా మెక్సికోలో తయారవుతుంది. టారిఫ్ అమల్లోకి రావడంతో అమెరికాకు దీని ఎగుమతులు కష్టంగా మారుతున్నాయి. యూఎస్‌లో చౌకగా లభించే కారు ఇకపై కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మెక్సికోకు బదులుగా అమెరికాలోనూ నిస్సాన్ చౌక వాహనాలను తయారు చేయడం సాధ్యమే అయినప్పటికీ, మెక్సికో నుంచి కొన్ని విడిభాగాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోతే సవాళ్లు ఎదురవుతాయి’ అని మ్యూనియర్ అన్నారు.
ఇదీ చదవండి: భారత్‌లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?
కాక్స్ ఆటోమోటివ్ విశ్లేషణ ప్రకారం.. యూఎస్‌లో కారు సగటు ధర 48,000 డాలర్లు(సుమారు రూ.40 లక్షలు). ప్రభావిత మోడళ్ల ధరలకు టారిఫ్‌లు 10% నుండి 15% వరకు అదనంగా పెరుగుతాయి. లెవీ పరిధిలో లేని వాహనాల ధరలు మొత్తంగా 5% పెరుగుతాయని సంస్థ అంచనా వేస్తోంది. టారిఫ్‌ల వల్ల ఎక్కువగా ప్రభావితమైన మోడళ్లలో 30,000 డాలర్ల(రూ.25 లక్షలు) కంటే తక్కువ ధర కలిగినవే ఉన్నాయి. వీటిలో దాదాపు అన్నీ యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉత్పత్తి అవుతున్నవే కావడం గమనార్హం.