
వెండి కళాకృతులకు సైతం
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
బీఐఎస్‌కు సూచనలు
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలకు తప్పనిసరి హాల్ మార్కింగ్ విజయవంతం కావడంతో వెండి ఆభరణాలు, కళాకృతులకు సైతం ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయడాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలంటూ భారతీయ ప్రమాణాల సంస్థను (బీఐఎస్) కోరినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ‘బంగారం మాదిరే వెండికీ హాల్ మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలంటూ వినియోగదారుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోండి’ అని బీఐఎస్ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంత్రి జోషి కోరారు. ఈ దిశగా కార్యాచరణను ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టిందని చెప్పారు. ‘అమలు సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని, వినియోగదారులు, ఆభరణాల డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరాను. భాగస్వాములు అందరితో మాట్లాడిన తర్వాతే ప్రక్రియ మొదలు పెడతాం’అని తెలిపారు. కాగా, మూడు నుంచి ఆరు నెలల్లో వెండికి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు.