
పర్యావరణహిత ఇంధనాల వైపు మళ్లే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది (2024–25) డీజిల్ డిమాండ్ నెమ్మదించింది. డీజిల్ వినియోగం 2 శాతమే పెరిగి 91.4 మిలియన్ టన్నులకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది ఏకంగా 12.1%. దేశీయంగా వినియోగించే ఇంధనాల్లో డీజిల్ వాటా దాదాపు 40% ఉంటుంది. డీజిల్ వినియోగం నెమ్మదించినప్పటికీ దేశీయంగా రవాణా రంగంలో నాలుగింట మూడొంతుల వాటా ఈ ఇంధనానిదే ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతుండటంతో డీజిల్ డిమాండ్‌పై ప్రభావం పడుతోందని వివరించాయి. డీజిల్ వినియోగం తగ్గడానికిగల మరిన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆర్థిక మందగమనం
అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక వృద్ధి క్షీణిస్తుండడం డీజిల్ వినియోగ కార్యకలాపాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ముఖ్యంగా రవాణా, నిర్మాణం, వ్యవసాయం వంటి రంగాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విభాగాల్లో వృద్ధి నెమ్మదించడంతో డీజిల్ వినియోగం పడిపోయింది.
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పెరుగుదల
పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు ఈవీ పాలసీను తీసుకొస్తున్నాయి. దాంతో చాలా మంది వినియోగదారులు సంప్రదాయ శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల కంటే విద్యుత్‌తో నడిచే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు, ఆటో రిక్షాలతో సహా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి వంటి క్విక్‌కామర్స్ కంపెనీలు తమ లాజిస్టిక్స్ ఫ్లీట్లను ఎలక్ట్రిక్ వాహనాలకు మారుస్తున్నాయి.
వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పు
డీజిల్ వాహనాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన 10 సంవత్సరాల పరిమితితో సహా అనేక భారతీయ నగరాలు డీజిల్ వాహనాలపై కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు పెట్రోల్, సీఎన్‌జీ వాహనాల వైపు మొగ్గుచూపడంతో డీజిల్ అమ్మకాలపై మరింత ప్రభావం పడింది.
ఇదీ చదవండి: కళను దొంగలిస్తున్న ఏఐ
ప్రభుత్వ విధానాలు
భారత ప్రభుత్వం సీఎన్జీ, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ మొబిలిటీకి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో డీజిల్ వాహనాలపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు.