న్యూఢిల్లీ: వ్యవసాయ పనులు, పరిశ్రమల అవసరాలు, ట్రక్కుల ద్వారా రవాణా పెరగడంతో ఏప్రిల్ ప్రథమార్ధంలో డీజిల్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి డీజిల్ విక్రయాలు 15 శాతం పెరిగి 3.45 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలలవారీగా చూసినప్పుడు మార్చి ప్రథమార్ధంలో నమోదైన 3.19 మిలియన్ టన్నులతో పోలిస్తే 8.4 శాతం పెరిగాయి.
ఇక పెట్రోల్ విషయానికొస్తే ఏప్రిల్ 1–15 మధ్య కాలంలో అమ్మకాలు 2 శాతం పెరిగి 1.14 మిలియన్ టన్నులకు చేరాయి. నెలవారీగా చూస్తే మాత్రం 6.6 శాతం మేర తగ్గాయి. కోవిడ్ పూర్వంతో (2020) పోలిస్తే ఏప్రిల్ ప్రథమార్ధంలో పెట్రోల్ అమ్మకాలు 128 శాతం, డీజిల్ అమ్మకాలు 127 శాతం పెరిగాయి. వార్షికంగా వంట గ్యాస్ విక్రయాలు 5.7 శాతం పెరిగి 1.1 మిలియన్ టన్నులకు చేరాయి.
మరోవైపు, ఏవియేషన్ కార్యకలాపాలు తిరిగి యథాప్రకారం ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ ప్రథమార్ధంతో పోలిస్తే తాజాగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 14 శాతం పెరిగి 2,84,600 టన్నులకు చేరాయి. నెలలవారీగా చూస్తే 3.8% తగ్గినప్పటికీ.. 2020తో పోల్చినప్పుడు 468 శాతం పెరిగాయి. పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకోవడం దేశీయంగా ఆయిల్ డిమాండ్‌కు ఊతమిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటు సర్వీసులు, అటు పరిశ్రమల నుంచి మద్దతుతో భారత్ స్థిరమైన వృద్ధి సాధించగలుగుతోందని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment