
సాక్షి, సిటీబ్యూరో: కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసిరావటమే. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. ఇళ్ల కొనుగోలు నిర్ణయంలో వీరు కీలకంగా మారారు. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్భణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు.
సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యం మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్‌ఎన్‌ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.