
జనవరి–మార్చి మధ్య 49 శాతం తగ్గిన ఇళ్ల విక్రయాలు
ఏడు నగరాల్లో 28 శాతం క్షీణత
పెరిగిపోయిన ధరలు, ప్రతికూల పరిణామాల ప్రభావం
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ నివేదిక
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది తొలి మూడు నెల ల్లో ఇళ్ల అమ్మకాలు బలహీనతను ఎదుర్కొన్నాయి. క్రితం ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 28 శాతం తక్కువగా 93,280 యూనిట్ల అమ్మకాలే నమోదవుతాయన్నది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనరాక్ అంచనా వేసింది. క్రితం ఏడాది తొలి క్వార్టర్‌లో (క్యూ1)లో ఈ నగరాల్లో అమ్మకాలు 1,30,170 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 49 శాతం తగ్గి 10,100 యూనిట్లుగా ఉంటాయన్నది అంచనా. 2024 మొదటి క్వార్టర్‌లో 19,660 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ‘‘ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగిపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు భారత హౌసింగ్ మార్కెట్ బుల్ ర్యాలీని 2025 క్యూ1లో నిదానించేలా చేశాయి’’అని అనరాక్ తన నివేదికలో పేర్కొంది.
పట్టణాల వారీగా విక్రయ అంచనాలు
ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో జనవరి–మార్చి మధ్య అమ్మకాలు 20 శాతం తక్కువగా 12,520 యూనిట్లకు పరిమితం కావొచ్చు. క్రితం ఏడాది తొలి క్వార్టర్‌లో ఇక్కడ 15,650 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో విక్రయాలు 26 శాతం క్షీణించి 31,610 యూనిట్లకు పరిమితమయ్యాయి.
బెంగళూరులో అమ్మకాలు 16% తక్కువగా 15,000 యూనిట్లకు పరిమితం కావొచ్చు.
పుణెలోనూ క్రితం ఏడాది క్యూ1తో పోల్చి చూస్తే 30 శాతం తగ్గి 16,100 యూనిట్లుగా ఉంటాయన్నది అంచనా.
చెన్నైలో అమ్మకాలు 26 శాతం క్షీణించి 4,050 యూనిట్లుగా ఉంటాయి.
కోల్‌కతా మార్కెట్లోనూ 31 శాతం తక్కువగా 3,900 యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. క్రితం ఏడాది తొలి క్వార్టర్‌లో అమ్మకాలు 5,650 యూనిట్లుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఉద్యోగం–జీవితం...సమతుల్యంపై అసంతృప్తి
ప్రతికూల పరిస్థితుల వల్లే..
‘‘దేశ ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నా యి. అంతర్జాతీయంగా చూస్తే దేశ జీడీపీ అత్యధిక వృద్ధి రేటును సాధించగా, ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే ఉంది. అదే సమయంలో ఇళ్ల ధరలు పెరిగిపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ లావాదేవీలపై ప్రభావం చూపించాయి. ఈ పరిణామాలన్నీ కలసి క్యూ1లో దేశ హౌసింగ్ మార్కెట్‌ను నిదానించేలా చేశాయి’’అని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పురి తెలిపారు.