రేపు ఉడిపి పీఠాధిపతి పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

రేపు ఉడిపి పీఠాధిపతి పాదయాత్ర

Published Mon, Apr 28 2025 12:37 AM | Last Updated on Mon, Apr 28 2025 12:37 AM

రేపు

రేపు ఉడిపి పీఠాధిపతి పాదయాత్ర

పుత్తూరు : గోసంరక్షణ నిమిత్తం ఉడిపి పీఠాధిపతి శ్రీఈషాప్రియ తీర్థ స్వామిజీ నిర్వహిస్తున్న పాదయాత్ర ఈనెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 7 గంటలకు పుత్తూరు చేరుకుంటుంది. స్వామిజీకి స్థానిక ఆర్డీఎం గేటు వద్ద హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి శివాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. 8 గంటలకు స్వామి అనుగ్రహ భాషణం ఉంటుందన్నారు. రాత్రి తడుకు గ్రామంలో బసచేసి, 30 తేదీ ఉదయం 8 గంటలకు అనుగ్రహ భాషణం అనంతరం 10 గంటలకు పాదయాత్ర రేణిగుంట వైపు కొనసాగుతుందని చెప్పారు.

నాటుసారా తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రొంపిచెర్ల : నాటు సారా తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిలోని రొంపిచెర్ల–పీలేరు మండలాల సరిహద్దులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బండకిందపల్లె పంచాయతీలోని బడబళ్ల వంక వద్ద రోడ్డు పక్కన సుమారు (45) ఏళ్ల వయస్సున్న వ్యక్తి మూడు రోజులుగా కమోళ్లపల్లె పక్కన ఉన్న రామానాయక్‌ తండా– యర్రగుంటపల్లె మధ్య తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. దుస్తులు లేకుండా డ్రాయర్‌ మాత్రమే వేసుకొని తిరుగుతున్నాడని చెప్పారు. పీలేరు మండలం రామానాయక్‌ తండాలో నాటుసారా తాగి అక్కడ నుంచి రోడ్డు పక్కకు వచ్చి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రోడ్డు మీద వెళ్తున్న వారు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహం ఎడమ చేతిపైన మన్మద్‌రాజ్‌ అనే పచ్చ బొట్టుతో పేరు రాసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తమిళనాడు రాష్టానికి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సుబ్బారెడ్డి కోరారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

గంగవరం : సొంత పని మీద పలమనేరుకు నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కూర్నిపల్లి గ్రామానికి చెందిన గిరిజమ్మ (57) గ్రామం నుంచి పలమనేరుకు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో కూర్నిపల్లి క్రాస్‌ ఓం శక్తి గుడి వద్ద హైవేలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చిత్తూరుకు రెఫర్‌ చేయగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థిని అదృశ్యం : కేసు నమోదు

తవణంపల్లె : మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. మండలంలోని విద్యార్థిని (14) పదో తరగతి పరీక్షలు రాసి ఇంటి వద్ద ఉండేదని వివరించారు. ఈనెల 24వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. బంధువుల ఇళ్లు, పరిసర గ్రామాల్లో వెతికినా ఆచూకీ కనిపించలేదన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

బంగారుపాళెం : మండలంలోని తగ్గువారిపల్లె సమీపంలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. తగ్గువారిపల్లెకు చెందిన రాజన్న మామిడి తోపు సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ 3,940 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

రూ.1.75 కోట్ల విద్యుత్‌ బిల్లుల వసూలు

చిత్తూరు కార్పొరేషన్‌ : ఆదివారం విద్యుత్‌ బిల్లులు చెల్లింపు కేంద్రాలు పనిచేశాయి. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యుత్‌ బిల్లుల వసూలు కేంద్రాలను తెరిచారు. మొత్తం 12,200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా తద్వారా రూ.1.75 కోట్లు వచ్చిందని ట్రాన్స్‌కో ఎస్‌ఈలు ఇస్మాయిల్‌ అహ్మద్‌, సురేంద్రనాయుడు వివరించారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,811 మంది స్వామివారిని దర్శించుకోగా 34,913 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.24 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

రేపు ఉడిపి పీఠాధిపతి పాదయాత్ర 
1
1/1

రేపు ఉడిపి పీఠాధిపతి పాదయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement