
తరచూ ఎక్కడో ఒక చోట ప్రేమోన్మాదుల దాష్టీకానికి అమ్మాయిలు బలవుతున్నారు. చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాల్సినవారు ప్రేమపాశానికి బలవుతూ కన్నవారికి శోకాన్ని మిగులుస్తున్నారు. మరోవైపు దాడులకు పాల్పడినవారు కటకటాల పాలై బతుకును బుగ్గి చేసుకుంటున్నారు.
యశవంతపుర: ప్రేమించలేదనే కోపంతో విద్యారి్థనిని మరో విద్యార్థి చాకుతో పొడిచి హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. యలహంక రాజనకుంట పోలీసుస్టేషన్ పరిధిలో దిబ్బూరులోని ప్రెసిడెన్సీ ఇంజనీరింగ్ కాలేజీ ఈ దారుణానికి వేదికైంది. కోలారుకు చెందిన లయస్మిత (19) హతురాలు. వివరాలు.. లయస్మిత ఈ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యారి్థని కాగా, ఆమె స్నేహితుడు పవన్ నృపతుంగ రోడ్డులో విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. లయస్మితను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. ఆమె ఇష్టం లేదని చెప్పినా పవన్ తీరు మారలేదు.
10 సార్లు కత్తితో పొడిచి హత్య
కాలేజీకీ వచ్చి ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి లయస్మితను క్లాసు నుంచి పిలిపించాడు. నన్ను ప్రేమిస్తావా, లేదా అని పవన్ డిమాండ్ చేయగా లయస్మిత నిరాకరించింది. దీంతో ఉన్మాదిగా మారిన పవన్ కత్తి తీసుకుని 10 సార్లు ఆమెను పొడిచాడు. లయస్మిత రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు వదిలింది. ఈ ఘోరాన్ని చూసిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.
తరువాత ప్రేమోన్మాది చాకుతో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గాయపడిన పవన్‌ను విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. పవన్ తరచూ కాలేజీకి వచ్చి ప్రేమ పేరుతో లయస్మితను వేధించినట్లు తెలిసింది. రాజనుకుంట పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమోన్మాది మారణకాండ తీవ్ర సంచలనం సృష్టించింది.
చదవండి: బెంగళూరులో వ్యాపారి ఆత్మహత్య.. సుసైడ్ నోట్‌లో బీజేపీ ఎమ్మెల్యే పేరు